భారత హాకీ జట్టు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024 ముగింపు వేడుకల్లో భారత బృంద పతకధారిగా అతడు వ్యవహరించనున్నాడు. కాంస్య పతకాల విజేత, షూటర్ మనూ భాకర్‌తో కలిసి ఫ్లాగ్‌బేరర్ హోదాలో ముందుండి నడవనున్నాడు.
భారత ఒలింపిక్ సంఘం ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. రెండు దశాబ్దాలుగా భారత హాకీకి వెన్నెముకగా ఉన్న శ్రీజేశ్ ఈ గౌరవానికి అర్హుడని పేర్కొంది. ఈ విషయం గురించి జావెలిన్ త్రోయర్, రజత పతక విజేత నీరజ్ చోప్రాతో చర్చించామని.. అందుకు అతడు సంతోషంగా ఒప్పుకొన్నాడని తెలిపింది. ఈ క్రమంలో శ్రీజేశ్ పేరును ఫ్లాగ్‌బేరర్‌గా ఎంపిక చేసినట్లు పేర్కొంది.
పతకాల ఖాతా తెరిచిన మనూ భాకర్
కాగా షూటర్ మనూ భాకర్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత పతకాల ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. తొలుత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన ఈ హర్యానా షూటర్.. సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో మరో కాంస్యం కైవసం చేసుకుంది. తద్వారా ఒలింపిక్స్ ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.
ఈ క్రమంలో ఆమెను ఫ్లాగ్‌బేరర్‌గా ప్రకటించింది భారత ఒలింపిక్ సంఘం. మరోవైపు.. టోక్యోలో స్వర్ణం గెలిచిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ప్యారిస్‌లో రజతంతో సరిపెట్టుకున్నాడు. అయినప్పటికీ.. వరుస ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు గెలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో మనూతో పాటు ఫ్లాగ్‌బేరర్‌గా ఈ హర్యానా ఆటగాడు ఉంటాడని అంతా భావించారు.
అయితే, వరుసగా భారత హాకీ జట్టు రెండోసారి కాంస్యం గెలవడంలో కీలక పాత్ర పోషించిన గోల్ కీపర్ శ్రీజేశ్ వైపు ఒలింపిక్ సంఘం మొగ్గుచూపింది. ప్యారిస్‌లో రిటైర్మెంట్ ప్రకటించిన ఈ కేరళ క్రీడాకారుడు.. భారత క్రీడా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా సముచిత గౌరవం ఇవ్వాలని భావించింది.
శ్రీజేశ్ పట్ల నీరజ్‌కు ఉన్న గౌరవానికి నిదర్శనం
ఈ విషయం గురించి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ.. ‘‘ముగింపు వేడుకల్లో శ్రీజేశ్‌ను ఫ్లాగ్‌బేరర్‌గా నియమించాలనుకుంటున్నామని నీరజ్ చోప్రాతో చెప్పాను. అందుకు బదులిస్తూ.. ‘మేడమ్.. ఒకవేళ పతకధారిగా ఎవరు సరైనవ్యక్తి అని మీరు గనుక నన్ను అడిగితే.. నేను కూడా కచ్చితగా శ్రీ భాయ్ పేరునే చెపుతా’ అన్నాడు.
శ్రీజేశ్ పట్ల నీరజ్‌కు ఉన్న గౌరవానికి ఇది నిదర్శనం. క్రీడా స్ఫూర్తితో తను ఇందుకు అంగీకరించాడు’’ అని హర్షం వ్యక్తం చేశారు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్‌కు నాలుగు కాంస్యాలు(షూటింగ్‌లో మూడు, హాకీ 1), ఒక రజత పతకం(పురుషుల జావెలిన్ త్రో) దక్కింది. ఇక ఆగష్టు 11న ఒలింపిక్స్ ముగింపు వేడుకలు జరుగనున్నాయి. ఇక ఆరంభ వేడుకల్లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ వెటరన్ ప్లేయర్ శరత్ కమల్ భారత బృంద పతకధారులుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
చదవండి: అర్షద్ కూడా మా బిడ్డ లాంటివాడే: నీరజ్ చోప్రా తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment