గంభీర్‌తో గొడవలు.. బీసీసీఐకి క్లారిటీ ఇచ్చిన కోహ్లి! | On Past Conflicts With Gambhir, Kohli's Clear Message To BCCI: Report | Sakshi
Sakshi News home page

గంభీర్‌తో గొడవలు.. బీసీసీఐకి క్లారిటీ ఇచ్చిన కోహ్లి!

Published Fri, Jul 19 2024 10:53 AM | Last Updated on Fri, Jul 19 2024 11:19 AM

On Past Conflicts With Gambhir, Kohli's Clear Message To BCCI: Report

కోహ్లి- గంభీర్‌ (PC: BCCI/IPL)

టీమిండియా హెడ్‌ కోచ్‌గా‌ గౌతం గంభీర్‌ నియామకం నేపథ్యంలో భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి భవిష్యత్తు ఏమవుతుందోనంటూ క్రికెట్‌ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరూ దూకుడు స్వభావం ఉన్నవాళ్లే కావడం.. పైగా గతంలో మైదానంలోనే ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లడం ఇందుకు కారణం.

గతేడాది ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా గౌతీ- కోహ్లి కొట్టుకున్నంత పనిచేశారు. నాడు లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌గా ఉన్న గంభీర్‌.. ఆర్సీబీ బ్యాటర్‌ కోహ్లి మధ్య వివాదానికి అఫ్గన్‌ పేసర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ అన్న సంగతి తెలిసిందే.

హోరాహోరీగా మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో నవీన్‌- కోహ్లి మధ్య మాటా మాటా పెరగగా.. గంభీర్‌ జోక్యం చేసుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన కోహ్లి.. ‘మీ ఆటగాళ్లకు ముందుగా బుద్ధి చెప్పండి’ అంటూ తీవ్రమైన పదజాలం ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి.

గంభీర్‌ కూడా ఇందుకు ఘాటుగానే స్పందించాడని వినికిడి. అయితే, ఐపీఎల్‌-2024లో సీన్‌ మారింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మెంటార్‌గా వచ్చిన గౌతీ.. ఆర్సీబీ ఓపెనర్‌ కోహ్లితో కలిసిపోయాడు.

ఇద్దరూ మైదానంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. తమ మధ్య విభేదాలు సమసిపోయాయన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. అయితే, తీవ్ర విమర్శల నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి పోయినట్లు నటించారని.. లోలోపల పరస్పరం గుర్రుగానే ఉన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి.

దీంతో గంభీర్‌, కోహ్లి వాటిని ఖండించారు. అయినా దుష్ప్రచారం ఆగలేదు. ఈ నేపథ్యంలో భారత జట్టు హెడ్‌ కోచ్‌గా గౌతీ ఎంపికకాగానే.. కోహ్లికి కష్టాలు మొదలు అన్నట్లుగా వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. గంభీర్‌తో బంధం గురించి కోహ్లి బీసీసీఐకి స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది.

గతంలోని గొడవల తాలూకు ప్రభావం కోచ్‌- ఆటగాడిగా తమ రిలేషన్‌పై ఉండబోదని.. భారత జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే తామిద్దరం ముందుకు సాగుతామని కోహ్లి క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.

తమ విషయంలో మేనేజ్‌మెంట్‌కు ఎలాంటి తలనొప్పి రాకుండా చూసుకునే బాధ్యత తనదేనని కోహ్లి చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఈ మెగా టోర్నీ అనంతరం సెలవు తీసుకున్న విరాట్‌ కోహ్లి.. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడనే ప్రచారం జరిగింది. అయితే, హెడ్‌ కోచ్‌గా ఈ పర్యటనతో ప్రస్థానం మొదలుపెట్టనున్న గంభీర్‌.. కోహ్లిని సెలవులు రద్దు చేసుకోవాల్సిందిగా కోరినట్లు తెలిసింది.

ఇందుకు తగ్గట్లుగానే కోహ్లి శ్రీలంకతో సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని చెప్పాడు. ఈ క్రమంలో గురువారం ప్రకటించిన జట్టులో అతడి పేరు ఉండటం గమనార్హం. చాంపియన్స్‌ ట్రోఫీ-2025(వన్డే)ని దృష్టిలో పెట్టుకుని గంభీర్‌ ప్రతిపాదనకు కోహ్లి ఇలా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement