‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కార్తీక్ త్యాగి
దుబాయ్: పంజాబ్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 8 పరుగులు కావాలి. రెండు మంచి షాట్‌లు చాలు! కానీ ఇలాంటి స్థితి నుంచి గతంలోనూ ఓడిన ఆ జట్టు దానిని పునరావృతం చేసింది. 19వ ఓవర్లో 4 పరుగులే చేసిన పంజాబ్ జట్టు... కార్తీక్ త్యాగి వేసిన ఆఖరి ఓవర్లో గెలిచేందుకు 4 పరుగులు చేయాలి. కానీ పంజాబ్ జట్టు ఒకటే పరుగు చేసి 2 వికెట్లు కూడా కోల్పోయి చేతులెత్తేసింది. చివరకు 2 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ అనూహ్య విజయాన్నందుకుంది. ముందుగా రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. యశస్వి (36 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మహిపాల్ లోమ్రోర్ (17 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), ఎవిన్ లూయిస్ (21 బంతుల్లో 36; 7 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 32 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులకే పరిమితమైంది. మయాంక్ (43 బంతుల్లో 67; 7 ఫోర్లు 2 సిక్సర్లు), రాహుల్ (33 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 71 బంతుల్లోనే 120 పరుగులు జోడించినా ఫలితం దక్కలేదు.
లోమ్రోర్ మెరుపులు...
రాజస్తాన్‌కు లభించిన ఆరంభం, ఇన్నింగ్స్ మధ్యలో లోమ్రోర్ మెరుపులు చూస్తే స్కోరు కనీసం 210–220 వరకు చేరుతుందని అనిపించింది. కానీ పంజాబ్ బౌలర్లు ప్రత్యర్థిని అంతకంటే చాలా తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఓపెనర్లు యశస్వి, లూయిస్ దూకుడుతో రాయల్స్ స్కోరు 5 ఓవర్లలోనే 50 పరుగులకు చేరింది. అయితే అర్ష్‌దీప్ తన తొలి ఓవర్లోనే లూయిస్‌ను అవుట్ చేసి జోడీని విడదీశాడు. ఐపీఎల్‌లో తన తొలి మ్యాచ్ ఆడుతున్న ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో యశస్వి 2 సిక్సర్లు, ఫోర్‌తో ధాటిని ప్రదర్శించగా... అర్ష్‌దీప్ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో 14 పరుగులు రాబట్టిన లివింగ్‌స్టోన్ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) తర్వాతి బంతికి వెనుదిరిగాడు. యశస్వి అవుటైనా... మరో ఎండ్‌లో లోమ్రోర్ చెలరేగిపోయాడు. రషీద్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అతను, హుడా ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టాడు. మరో ఫోర్ సహా ఈ ఓవర్లో హుడా మొత్తం 24 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఈ ఓవర్ తర్వాత రాజస్తాన్ వేగంగా పతనమైంది. ఆఖరి 4 ఓవర్లలో 21 పరుగులు చేసిన ఆ జట్టు 6 వికెట్లు చేజార్చుకుంది.
ఓపెనర్లు జోరుగా...
ఛేదనలో రాహుల్, మయాంక్ వేగంగా పరుగులు రాబట్టారు. రాహుల్‌కు ఏకంగా మూడుసార్లు ‘లైఫ్’ లభించింది. సకారియా ఓవర్లో రాహుల్ వరుసగా 4, 6, 6 బాది జోరు ను ప్రదర్శించగా, త్యాగి ఓవర్లో మయాంక్ ఇలాగే వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. పవర్ ప్లేలో 49 పరుగులు చేసిన కింగ్స్ స్కోరు 10 ఓవర్లు ముగిసేసరికి 106కు చేరింది. ముఖ్యంగా మోరిస్ వేసిన పదో ఓవర్లో పంజాబ్ 25 పరుగులు సాధించింది. ఎట్టకేలకు ఆరు పరుగుల వ్యవధిలో వీరిద్దరిని అవుట్ చేసి రాయల్స్ ఊపిరి పీల్చు కుంది. అయితే తర్వాత వచ్చిన మార్క్‌రమ్ (20 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), పూరన్ (22 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్సర్లు) కలిసి పంజాబ్‌ను విజయానికి చేరువగా తెచ్చారు. వీరిద్దరు 37 బంతుల్లోనే 57 పరుగులు జత చేసినా... చివరకు పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: లూయిస్ (సి) మయాంక్ (బి) అర్ష్‌దీప్ 36; యశస్వి (సి) మయాంక్ (బి) హర్‌ప్రీత్ 49; సామ్సన్ (సి) రాహుల్ (బి) పొరేల్ 4; లివింగ్‌స్టోన్ (సి) అలెన్ (బి) అర్ష్‌దీప్ 25; లోమ్రోర్ (సి) మార్క్‌రమ్ (బి) అర్ష్‌దీప్ 43; పరాగ్ (సి) మార్క్‌రమ్ (బి) షమీ 4; తెవాటియా (బి) షమీ 2; మోరిస్ (సి) మార్క్‌రమ్ (బి) షమీ 5; సకారియా (సి అండ్ బి) అర్ష్‌దీప్ 7; త్యాగి (బి) అర్ష్‌దీప్ 1; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 185. వికెట్ల పతనం: 1–54, 2–68, 3–116, 4–136, 5–166, 6–169, 7–175, 8–178, 9–185, 10–185. బౌలింగ్: షమీ 4–0– 21–3, పొరేల్ 4–0–39–1, హుడా 2–0– 37–0, అర్ష్‌దీప్ 4–0–32–5, రషీద్ 3–0– 35–0, హర్‌ప్రీత్ 3–0–17–1.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) త్యాగి (బి) సకారియా 49; మయాంక్ (సి) లివింగ్‌స్టోన్ (బి) తెవాటియా 67; మార్క్‌రమ్ (నాటౌట్) 26; పూరన్ (సి) సామ్సన్ (బి) త్యాగి 32; హుడా (సి) సామ్సన్ (బి) త్యాగి 0; అలెన్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1–120, 2–126, 3–183, 4–183.
బౌలింగ్: ముస్తఫిజుర్ 4–0–30–0, సకారియా 3–0– 31–1, త్యాగి 4–0–29–2, మోరిస్ 4–0– 47–0, తెవాటియా 3–0–23–1, లోమ్రోర్ 1–0–7–0, పరాగ్ 1–0–16–0.
Comments
Please login to add a commentAdd a comment