![PCB Gives Update: Saim Ayub Ruled Out Of Champions Trophy 2025](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/pcb.jpg.webp?itok=9WZO9t_l)
ఓవైపు స్టార్ ఆటగాడు దూరం.. మరోవైపు ముక్కోణపు టోర్నీ
తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పాకిస్తాన్ పోరు
మధ్యాహ్నం గం. 2:30 నుంచి ఫ్యాన్ కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ ఓపెనర్ సయీమ్ అయూబ్(Saim Ayub) గాయం కారణంగా సొంతగడ్డపై ఈనెల 19 నుంచి జరిగే ఈ మెగా వన్డే టోర్నమెంట్‌కు దూరమయ్యాడు.
గత నెల దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా.. టెస్టు సిరీస్ సందర్భంగా అతడి చీలమండకు ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో.. అప్పటి నుంచి అతడు ఇంగ్లండ్‌లోనే పునరావాస శిబిరంలో గడుపుతున్నాడు.
అయితే గాయం తీవ్రత దృష్ట్యా కనీసం పది వారాలు విశ్రాంతి తీసుకోవాలని బోర్డు వైద్య సిబ్బంది నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీకి ఆయూబ్ గైర్హాజరు కానున్నాడు. నిజానికి గాయపడటానికి ముందు ఈ 22 ఏళ్ల ఎడంచేతి వాటం బ్యాటర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా, జింబాబ్వే, దక్షిణాఫ్రికా పర్యటనలలో అదరగొట్టాడు.
ఆ సిరీస్‌కూ దూరం
ముఖ్యంగా సఫారీ జట్టుతో జరిగిన వన్డేల్లో సెంచరీలతో కదంతొక్కిన అయూబ్ జింబాబ్వేతో టీ20లో ‘శత’క్కొట్టాడు. ఇక వచ్చే నెల న్యూజిలాండ్ పర్యటనకు అతడు అందుబాటులో ఉండేది అనుమానమేనని తెలిసింది. మెడికల్ రిపోర్టులు, ఫిట్‌నెస్ టెస్టులను పరిశీలించాకే కివీస్ పర్యటనకు ఎంపిక చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తామని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.
కాగా న్యూజిలాండ్‌లో పాకిస్తాన్ ఐదు టీ20లు, మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొంటుంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లు జరుగుతాయి.
క్రికెట్ పండుగ
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత క్రికెట్ పండగ జరగబోతోన్న విషయం తెలిసిందే. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం నవీకరించిన స్టేడియాల సామర్థ్యం, ఆ టోర్నీకి ముందు సిద్ధమైన మూడు మేటి జట్ల సత్తా ఏంటో పరీక్షించుకునేందుకు సన్నాహక ముక్కోణపు టోర్నీ శనివారం నుంచి మొదలుకానుంది. లాహోర్, కరాచీ, రావల్పిండి వేదికలపై ఆతిథ్య పాక్ సహా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లు ఈ ముక్కోణపు సిరీస్‌లో తలపడనున్నాయి.
ఇందులో భాగంగా శనివారం పాకిస్తాన్, న్యూజిలాండ్‌ల మధ్య లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో తొలి పోరు జరుగనుంది. 35 వేల సీట్ల సామర్థ్యం గల ఈ స్టేడియాన్ని ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నవీకరించింది. వందల సంఖ్యలో రోజుల తరబడి కారి్మకులు శ్రమించి నిర్ణీత సమయానికల్లా మైదానాలకు అందుబాటులోకి తెచ్చారని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నఖ్వీ కితాబిచ్చారు.
ఇటు ఆతిథ్య దేశంతో పాటు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలు మెగా ఈవెంట్‌కు సరైన సన్నాహక టోర్నీగా ఈ ముక్కోణపు టోర్నీ మ్యాచ్‌ల్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాయి. తద్వారా స్థానిక పరిస్థితులకు అలవాటు పడటంతో పాటు ఐసీసీ మెగా టోర్నీకి వేదికలైన స్టేడియాల పిచ్‌పై కూడా అవగాహన పెంచుకోవచ్చని కివీస్, సఫారీలు భావిస్తున్నాయి.
ఇరుజట్లలోని ఆటగాళ్లలో కొందరు మినహా దాదాపు మెగా ఈవెంట్‌లో పాల్గొనే క్రికెటర్లతోనే ఈ టోర్నీ ఆడేందుకు వచ్చాయి. ఫిబ్రవరి 14న కరాచీలో జరిగే ఫైనల్స్‌తో ఈ ముక్కోణపు టోర్నీ ముగుస్తుంది. తర్వాత ఐదు రోజుల వ్యవధిలోనే 19న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలవుతుంది.
చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్
Comments
Please login to add a commentAdd a comment