నేను వాళ్లలా కాదు.. నాకు క్లారిటీ ఉంది: రోహిత్‌ విమర్శలు | People Retire And Take U Turns: Rohit Sharma Dig At Cricketers From Other Countries | Sakshi
Sakshi News home page

నేను వాళ్లలా కాదు.. గుడ్‌బై చెప్పేశా: రోహిత్‌ విమర్శలు

Published Wed, Sep 18 2024 6:31 PM | Last Updated on Wed, Sep 18 2024 7:28 PM

People Retire And Take U Turns: Rohit Sharma Dig At Cricketers From Other Countries

రిటైర్మెంట్‌పై యూటర్న్‌ తీసుకునే ఆటగాళ్లపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విమర్శలు గుప్పించాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత మళ్లీ తిరిగి రావడంలో అర్థం లేదన్నాడు. విదేశీ ఆటగాళ్లలో చాలా మంది ఇలా రిటైర్మెంట్‌ను ఓ జోక్‌లా మార్చేశారని.. అయితే, భారత్‌లో మాత్రం ఇలాంటివి జరగవని అభిప్రాయపడ్డాడు.

టీమిండియాను చాంపియన్‌గా నిలిపి
తాను ఎట్టిపరిస్థితుల్లోనూ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేయబోనని రోహిత్‌ శర్మ స్పష్టం చేశాడు. కాగా 2007లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన హిట్‌మ్యాన్‌.. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆడాడు. తాజా.. తొమ్మిదో పొట్టి వరల్డ్‌కప్‌ టోర్నమెంట్లో కెప్టెన్‌ హోదాలో బరిలోకి దిగి టీమిండియాను చాంపియన్‌గా నిలిపాడు. 

అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై
అనంతరం అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అయితే, రోహిత్‌ శర్మ టీమిండియా తరఫున పొట్టి క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అతడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజుల్లో రిటైర్మెంట్‌ పెద్ద జోక్‌లా తయారైంది. చాలా మంది క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలుకుతున్నారు. 

నేను గుడ్‌బై చెప్పాను.. నా  నిర్ణయంలో మార్పు లేదు
ఆ వెంటనే మళ్లీ తిరిగి వస్తున్నారు. అయితే, ఇండియాలో అలా జరుగదు. ఇతర దేశాల ఆటగాళ్లను నేను గమనిస్తున్నాను. వారిలో చాలా మంది రిటైర్మెంట్‌పై యూటర్న్‌ తీసుకుంటున్నారు. కాబట్టి ఓ ఆటగాడు రిటైర్‌ అయ్యాడో లేదనన్న అంశంపై మనకు స్పష్టత ఉండదు. అయితే, నా విషయంలో అలా జరుగదు. 

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు నేను గుడ్‌బై చెప్పాను. నా ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ విషయంలో నాకు పూర్తి స్పష్టత ఉంది’’ అని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ గతంలో వన్డేలకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

గతంలో చాలా మంది ఇలాగే
అయితే, వన్డే ప్రపంచకప్‌-2023కి ముందు తాను యూటర్న్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. భారత్‌ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో అతడు పాల్గొన్నాడు. ఇక పాకిస్తాన్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ సైతం కొన్నేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించగా.. మేనేజ్‌మెంట్‌ అతడిని వెనక్కి రప్పించింది. 

ఇటీవలి టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఆమిర్‌ ఆడాడు. అదే విధంగా గతంలో షాహిద్‌ ఆఫ్రిది కూడా పలుమార్లు రిటైర్మెంట్‌​ ప్రకటించి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రోహిత్‌ శర్మ గురువారం(సెప్టెంబరు 19) నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌తో బిజీ కానున్నాడు. 

చదవండి: వరల్డ్‌ నంబర్‌ వన్‌గా ఇంగ్లండ్‌ విధ్వంసకర వీరుడు.. ఏకంగా..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement