అడిలైడ్: గతంలా మాదిరిగా రాణించలేకపోతున్న 34 ఏళ్ల స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పింక్ బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సత్తా చాటాడు. 18 ఓవర్లు బౌలింగ్ చేసి 55 పరుగులు ఇచ్చి 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై అతనికిది 8వ టెస్టు మ్యాచ్. కంగారూల దేశంలో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీయడం అశ్విన్‌కు ఇది రెండోసారి. 2015 సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 105 పరుగులు ఇచ్చిన అశ్విన్ ఒక ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశాడు. ఇక ఆస్ట్రేలియాలో అశ్విన్ టెస్టు క్రికెట్ ఉత్తమ గణాంకాలు 149 పరుగులకు 6 వికెట్లు. మరో మూడు రోజుల ఆట మిగిలిఉండటం.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయనుండటంతో ఈ పింక్ బాల్ టెస్టులోనే అతని బెస్ట్ మరింత మెరుగయ్యే అవకాశాలున్నాయి.
భారత్ బాటలోనే వారు కూడా
తొలి రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసిన టీమిండియా మరుసటి రోజు ఉదయం ఎక్కువసేపు నిలవలేకపోయింది. మరో 11 పరుగులు మాత్రమే చేసి మిగతా 4 వికెట్లు కోల్పోయింది. దీంతో 244 పరుగుల వద్ద కోహ్లి సేన తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ముగిసింది. అయితే, ఆస్ట్రేలియాతో తొలిసారి పింక్‌బాల్‌తో ఆడుతూ తడబడిన భారత బ్యాట్స్‌మెన్ మాదిరిగానే.. జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, అశ్విన్ దెబ్బకు ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్ కూడా బెంబేలెత్తారు. ముఖ్యంగా స్పిన్నర్ అశ్విన్ కీలకమైన స్టీవ్ స్మిత్ వికెట్ తీసి తన జోరు ప్రారంభించాడు. అనంతరం ట్రావీస్ హెడ్, కామెరూన్ గ్రీన్‌ను పెవిలియన్ పంపించాడు. రెండోరోజు ఆట మరికాసేపట్లో ముగుస్తుందనగా మరోసారి బంతిని అందుకున్న అశ్విన్ నాథన్ లయన్ వికెట్ తీయడంతో కంగారూ జట్టు 191 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా రెండు, ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లతో రాణించారు. స్టార్క్ రనౌట్ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment