ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ప్రస్తుతం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌తో బిజీగా ఉన్నాయి. ఇరుజట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. బజ్‌బాల్ ఆటతీరుతో దూకుడు మీదున్న ఇంగ్లండ్‌కు.. ఆసీస్ ఓటమి రుచి చూపించి బ్రేకులు వేసింది. అయితే 2021లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-4 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ దెబ్బతో అప్పటి టెస్టు కెప్టెన్ జో రూట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోగా.. బ్యాటింగ్ మెంటార్‌గా ఉన్న గ్రహం థోర్ఫ్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న అష్లే గైల్స్ తమ పదవులను కోల్పోయారు.
ఆ తర్వాత రాబ్ కీ అనే వ్యక్తి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కి కొత్త డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. కాగా రాబ్ కీ వచ్చీ రావడంతోనే తన మార్క్‌ను చూపించే ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవికి మెక్‌కల్లమ్ కంటే ముందు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌ను సంప్రదించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా పాంటింగ్ తాజాగా రివీల్ చేశాడు.
గురిల్లా క్రికెట్‌పాడ్ కాస్ట్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన పాంటింగ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ''మెక్‌కల్లమ్ కంటే ముందు ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవికి నన్ను ముందు సంప్రదించారు. ఈ విషయంలో రాబ్ కీ కీలకంగా వ్యవహరించాడు. అతనే స్వయంగా నా దగ్గరకు వచ్చి ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా ఆఫర్ ఇచ్చాడు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో దానిని తిరస్కరించా.
ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ కోచ్‌గా ఫుల్‌టైమ్ పనిచేయడానికి అప్పటికి నేను మానసికంగా సిద్దం కాలేదు. పిల్లలు చిన్నవాళ్లు కావడం.. అంతర్జాతీయ కోచ్‌గా ఉంటే జట్టుతో పాటు వివిధ దేశాలకు పర్యటించాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీకి దూరంగా ఉండాలని అనుకోలేదు. అందుకే కోచ్ పదవి ఆఫర్‌ను తిరస్కరించాల్సి వచ్చింది.'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవి వరించింది. రూట్ స్థానంలో బెన్ స్టోక్స్ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వీరిద్దరు కలిసిన తర్వాత ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ పూర్తిగా మారిపోయింది. బజ్‌బాల్ క్రికెట్‌ను పరిచయం చేసిన ఈ ద్వయం ఇంగ్లండ్‌కు టెస్టుల్లో వరుస విజయాలు కట్టబెట్టారు. ఈ ఇద్దరు బాధ్యతలు తీసుకున్నాకా ఇంగ్లండ్ టెస్టుల్లో 13 మ్యాచ్‌ల్లో 11 విజయాలు సాధించడంతో పాటు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లాంటి జట్లపై సిరీస్ విజయాలు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment