ఐపీఎల్-2025 మెగా వేలంలో ఢిల్లీ యువ సంచలనం ప్రియాన్ష్ ఆర్యపై కాసుల వర్షం కురిసింది. ప్రియాన్ష్ ఆర్యను రూ. 3.80 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కైవసం చేసుకుంది. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆర్య కోసం తొలుత ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి.
ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చింది. కాసేపు పంజాబ్, ఢిల్లీ మధ్య పోటీ నెలకొంది. అనంతరం ఢిల్లీ పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రియాన్ష్‌య పంజాబ్ సొంతమయ్యాడు.
ఎవరీ ప్రియాన్ష్ ఆర్య..?
23 ఏళ్ల ప్రియాన్ష్ ఆర్య లిస్ట్-ఎ క్రికెట్‌లో ఢిల్లీ తరపున ఆడుతున్నాడు. ప్రియాన్స్ ఆర్యా 2019లో భారత్ అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు భారత సీనియర్ జట్టు తరఫున ఆడుతున్న యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్‌తో కలిసి అతడు ఆడాడు.
అయితే ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024 ద్వారా ప్రియాన్ష్ వెలుగులోకి వచ్చాడు. ఈ ఏడాది డీపీఎల్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరపున ఆర్య ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. టోర్నీ ఆసాంతం ప్రియాన్ష్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.
ఈ టోర్నీలో ఆర్య 198.69 స్ట్రైక్‌రేటుతో 608 పరుగులు చేశాడు. టీ20ల్లో కూడా మంచి రికార్డు ఈ యువ క్రికెటర్‌కు ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 356 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment