పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023లో భాగంగా ముల్తాన్ సుల్తాన్స్‌తో నిన్న (మార్చి 4) జరిగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ సామ్ బిల్లింగ్స్ (35 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీతో చెలరేగగా.. షఫీక్ (35 బంతుల్లో 48; 6 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించాడు.
ఫకర్ జమాన్ (0), తలాత్ (9), రషీద్ ఖాన్ (0), షాహీన్ అఫ్రిది (9), హరీస్ రౌఫ్ (0) విఫలం కాగా.. మీర్జా బేగ్ (17), సికందర్ రజా (14), డేవిడ్ వీస్ (15 నాటౌట్) రెండంకెల స్కోర్ చేశారు. సుల్తాన్స్ బౌలర్లలో అన్వర్ అలీ, ఇహసానుల్లా, అబ్బాస్ అఫ్రిది, పోలార్డ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సమీన్ గుల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సుల్తాన్స్ బౌలర్లు 14 ఎక్స్‌ట్రా పరుగులు ఇచ్చారు. ఇందులో 11 వైడ్ బాల్స్ ఉండటం విశేషం.
అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సుల్తాన్స్.. నిర్ణీత ఓవర్లు పూర్తియ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఖలందర్స్ బౌలర్ రషీద్ ఖాన్ (4-0-15-3) తన స్పిన్ మాయాజాలంతో సుల్తాన్స్‌ను భారీ దెబ్బకొట్టగా.. జమాన్ ఖాన్ (1/23), హరీస్ రౌఫ్ (1/30), సికందర్ రజా (1/10), హుసేన్ తలాత్ (1/22) తలో వికెట్ పడగొట్టారు.
సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో కీరన్ పోలార్డ్ (28 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించినా ప్రయోజనం లేకుండా పోయింది. మహ్మద్ రిజ్వాన్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో సీజన్ ఆరంభంలో వరుసగా విజయాలు సాధించిన సుల్తాన్స్.. రిజ్వాన్ ఒక్కసారిగా లయ తప్పడంతో పరాజయాల బాటపట్టింది. లీగ్‌లో ఇవాళ (మార్చి 5) ఇస్లామాబాద్ యునైటెడ్, క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment