పుజారా 157 నాటౌట్ (PC: BCCI Domestic X)
Ranji Trophy 2023-24- Saurashtra vs Jharkhand: టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌ను సెంచరీతో ఆరంభించాడు. జార్ఖండ్‌తో శనివారం నాటి ఆటలో ఈ సౌరాష్ట్ర బ్యాటర్ శతక్కొట్టాడు. తద్వారా ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్ జట్టు ప్రకటనకు ముందు తానూ రేసులోనే ఉన్నానంటూ బీసీసీఐ సెలక్టర్లకు గట్టి సందేశం ఇచ్చాడు.
కాగా దేశవాళీ క్రికెట్‌లో సొంత జట్టు సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా.. గత కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇంగ్లండ్ కౌంటీల్లోనూ సెంచరీలు బాదుతూ ఎప్పటికప్పుడు తన ఫామ్‌ను నిరూపించుకుంటూనే ఉన్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత నో ఛాన్స్
ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా ఆస్ట్రేలియాతో ఫైనల్ ఆడే అవకాశం దక్కించుకున్న పుజారా.. ఆ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తుదిపోరులో కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓడి డబ్ల్యూటీసీ టైటిల్‌ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. పుజారా టీమిండియా తరఫున ఆడిన ఆఖరి టెస్టు ఇదే. ఆ తర్వాత సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. సౌతాఫ్రికాతో ఇటీవల ముగిసిన టెస్టులకూ ఎంపిక చేయలేదు.
మళ్లీ దేశవాళీ క్రికెట్‌పై దృష్టి
ఈ క్రమంలో మళ్లీ దేశవాళీ క్రికెట్‌పై దృష్టిపెట్టిన పుజారా.. తాజాగా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగాడు. రాజ్‌కోట్ వేదికగా జార్ఖండ్‌తో శుక్రవారం మొదలైన ఐదు రోజుల మ్యాచ్‌లో భాగంగా శనివారం సెంచరీతో మెరిశాడు. వికెట్ పడకుండా.. ఆచితూచి ఆడుతున్న ఈ ‘నయా వాల్’ తన శతకాన్ని ద్విశతకంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాడు.
పుజారా 157 నాటౌట్
జార్ఖండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర తొలుత బౌలింగ్ చేసింది. పేసర్ చిరాగ్ జాని ఐదు వికెట్లతో చెలరేగడంతో జార్ఖండ్‌ను 142 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్రకు ఓపెనర్ హర్విక్ దేశాయ్ 85 పరుగులు సాధించి శుభారంభం అందించాడు.
వన్‌డౌన్ బ్యాటర్ షెల్డన్ జాక్సర్ అర్ధ శతకం(54)తో రాణించగా.. అర్పిత్ వసవాడ కూడా హాఫ్ సెంచరీ(68) చేశాడు. ఇక పుజారా 239 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 157 పరుగులతో క్రీజులో ఉండగా.. అతడికి తోడుగా ప్రేరక్ మన్కడ్ 23 పరుగులతో అజేయంగా ఉన్నాడు.
పటిష్ట స్థితిలో ఉనాద్కట్ బృందం
ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి సౌరాష్ట్ర 119 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 406 పరుగుల భారీ స్కోరు సాధించింది. పుజారా అద్భుత ఇన్నింగ్స్ కారణంగా జార్ఖండ్ మీద ఆధిపత్యం కొనసాగిస్తోంది. కాగా రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రకు టీమిండియా పేసర్ జయదేవ్ ఉనాద్కట్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
చదవండి: BCCI: ఇంగ్లండ్‌తో తలపడే భారత్-‘ఏ’ జట్టు ప్రకటన.. కెప్టెన్ అతడే
Comments
Please login to add a commentAdd a comment