Pujara Unlucky Dismissal India vs England Chennai 1st Test - Sakshi
Sakshi News home page

పాపం.. దురదృష్టం అంటే పుజారాదే

Published Sun, Feb 7 2021 7:58 PM | Last Updated on Mon, Feb 8 2021 8:38 AM

Pujara Unlucky Catch Out In First Test Against England Becomes Viral - Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా అవుటైన తీరు చూస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేం. 73 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన దశలో పంత్‌తో కలిసి పుజారా టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.దాదాపు ఇద్దరి మధ్య 5వ వికెట్‌కు 119 పరుగులు భాగస్వామ్యం ఏర్పడింది. టీమిండియా కోలుకుంటున్న దశలో పుజారా అవుట్‌ అవడంతో పెద్ద దెబ్బ పడింది.

ఇన్నింగ్స్ 51వ ఓవర్ వేసిన స్పిన్నర్ డొమినిక్ బెస్ బౌలింగ్‌లో చతేశ్వర్ పుజారా (73 పరుగులు) స్వ్కేర్ లెగ్ దిశగా బంతిని ఫుల్ చేశాడు. షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ అయ్యింది. కానీ.. బంతి నేరుగా వెళ్లి షార్ట్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్ భుజానికి తాకి మిడాన్‌లో గాల్లోకి లేచింది. దాంతో అక్కడే ఉన్న రోరీ బర్న్స్ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో పుజారాకు ఏం చేయాలో అర్థం కాక కోపంతో బ్యాట్‌ను నేలకేసి కొడుతూ నిరాశగా పెవిలియన్‌ బాట పట్టాడు. అయితే డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న కోహ్లి కూడా పుజారా అవుట్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

పుజారా అవుట్‌కు సంబంధించిన వీడియోనూ రితేష్‌ మహాతో అనే వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేశాడు. పుజారాది నిజంగా దురదృష్టం.. మంచిగా ఆడుతున్న సమయంలో ఊహించని రీతిలో అవుట్‌ కావడం నిరాశకు గురిచేసింది. అవుట్‌ విషయంలో పుజారాకు న్యాయం జరగాలి అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఆసీస్‌తో సిరీస్‌లో ఎక్కువ బంతులు ఆడిన పుజారా ఇంగ్లండ్‌తో మాత్రం తన శైలికి విరుద్ధంగా ఆడాడు. ఇన్నింగ్స్‌ ఆసాంతం అతని స్ట్రైక్‌రేట్‌ 51కి పైగా కొనసాగడం విశేషం. ఈ మధ్యనే తనకు ఐపీఎల్‌లో ఆడాలని ఉందని పుజారా తన ఇష్టాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే పుజారా అవుటైన కాసేపటికే సెంచరీకి చేరువగా వచ్చిన పంత్‌ కూడా ఔటవడంతో టీమిండియాకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.ప్ర‌స్తుతం క్రీజులో వాషింగ్ట‌న్ సుంద‌ర్ (33), అశ్విన్ (8) ఉన్నారు. ఇంగ్లండ్ కంటే భారత్‌ ఇంకా 321 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. టీమిండియా ఫాలోఆన్‌ గండం నుంచి బయటపడాలంటే మరో 200 పరుగులు చేయాల్సి ఉంది. అశ్విన్‌, సుందర్‌ల తర్వాత మిగిలినవారు టెయిలెండర్లు కావడంతో టీమిండియా ఫాలోఆన్‌ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

చదవండి: 
రూట్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. బిత్తరపోయిన రహానే
ఏంటి పంత్‌.. ఈసారి కూడా అలాగేనా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement