బ్యాంకాక్: ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధుకు ఊరట విజయం లభించింది. వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయిన ఈ స్టార్ షట్లర్... శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో 21–18, 21–15తో ప్రపంచ 13వ ర్యాంకర్ పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. శుక్రవారంతో లీగ్ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి.
గ్రూప్ ‘బి’లో రెండేసి విజయాలు సాధించి తొలి రెండు స్థానాల్లో నిలిచిన పోర్న్‌పవీ, ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్), సింధు ఒక్కో విజయం సాధించి లీగ్ దశలోనే నిష్క్రమించారు. ఓవరాల్‌గా పాయింట్ల ఆధారంగా గ్రూప్ ‘బి’లో రచనోక్ మూడో స్థానంలో, సింధు చివరిదైన నాలుగో స్థానంలో నిలిచారు. గ్రూప్ ‘ఎ’ నుంచి యాన్ సె యంగ్ (దక్షిణ కొరియా), కరోలినా మారిన్ (స్పెయిన్) సెమీఫైనల్ చేరుకున్నారు.
పోర్న్‌పవీతో గతంలో నాలుగుసార్లు ఆడి మూడుసార్లు నెగ్గిన సింధుకు ఈసారీ అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో కీలకదశలో పాయింట్లు నెగ్గిన సింధు రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. ‘ఈ టోర్నీలో నాకు మంచి ముగింపు లభించింది. తై జు యింగ్ చేతిలో ఓడిపోవడంతో నా సెమీఫైనల్ అవకాశాలు దెబ్బతిన్నాయి. గత మ్యాచ్‌ల ఫలితాలతో గుణపాఠాలు నేర్చుకొని ప్రతి రోజును కొత్తగా మొదలుపెట్టాలి. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉంది. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్లి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటా. మళ్లీ తాజాగా కోర్టులో అడుగుపెడతా’ అని సింధు వ్యాఖ్యానించింది.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–12, 18–21, 19–21తో పోరాడి ఓడిపోయాడు. గ్రూప్ ‘బి’ నుంచి జు వె వాంగ్ (చైనీస్ తైపీ), ఆంటోన్సెన్ (డెన్మార్క్) సెమీఫైనల్ చేరుకోగా... అంగుస్ మూడో స్థానంలో, శ్రీకాంత్ నాలుగో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించారు. గ్రూప్ ‘ఎ’ నుంచి అక్సెల్‌సన్ (డెన్మార్క్), తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ) సెమీఫైనల్లోకి ప్రవేశించారు.
Comments
Please login to add a commentAdd a comment