
Quinton De Kock Retirement: దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌కు డికాక్ వీడ్కోలు పలికాడు. సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరగిన తొలి టెస్ట్ అనంతరం డికాక్ ఈ విషయాన్ని ప్రకటించాడు. డికాక్ రిటైర్మెంట్ విషయాన్ని క్రికెట్ సౌత్ ఆఫ్రికా అధికారంగా ధ్రువీకరించింది. సెంచూరియన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డి కాక్ 34 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేశాడు. కాగా మొదటి టెస్టులో ప్రోటీస్ 113 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు తెలిపాడు.
"ఇది నేను అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు. సాషా, నేను మా మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించబోతున్నాము. నా జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని గురించి చాలా ఆలోచించాను. నా కుటుంబమే నాకు సర్వస్వం. మా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను" అని డికాక్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా తరపున 54 టెస్ట్‌లు ఆడిన క్వింటన్ డి కాక్ ఆరు సెంచరీలు, 22 అర్ధ సెంచరీలతో 3,300 పరుగులు చేశాడు.
చదవండి: IND Vs SA: స్టన్నింగ్ విక్టరీ.. డ్యాన్స్‌లతో దుమ్మురేపిన టీమిండియా ఆటగాళ్లు