బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియాను గెలిపించిన రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్‌లు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో(డబ్ల్యూటీసీ) భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఐసీసీ ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.
బంగ్లాతో రెండో టెస్టులో అశ్విన్ ఆరు వికెట్లు సహా బ్యాటింగ్‌లో 42 పరుగులు(నాలుగో ఇన్నింగ్స్) చేశాడు. 145 పరుగులను చేధించే క్రమంలో 70 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి అశ్విన్ 71 పరుగుల విలువైన భాగస్వామ్యం నిర్మించి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. బౌలింగ్ విభాగంలో అశ్విన్ 812 పాయింట్లతో మరో టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇక అక్షర్ పటేల్ ఒక స్థానం దిగజారి 19వ స్థానంలో నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో అశ్విన్ తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 343 పాయింట్లతో అశ్విన్ రెండో స్థానంలో ఉండగా.. తొలి స్థానాన్ని జడేజా కాపాడుకున్నాడు. 369 పాయింట్లతో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు.
ఇక బ్యాటింగ్ విభాగంలో టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ దుమ్మురేపాడు. బంగ్లాతో టెస్టు సిరీస్‌లో మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన అయ్యర్ ముఖ్యంగా రెండో టెస్టులో అద్బుతంగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేసిన అయ్యర్.. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌కు మద్దతిస్తూ 29 పరుగులు నాటౌట్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో అయ్యర్ ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 666 పాయింట్లతో 16వ స్థానంలో నిలిచాడు.
ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో ఎలాంటి మార్పు లేదు. బంగ్లాతో రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 93 పరుగులు చేసిన పంత్ తన ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగా.. రోహిత్ శర్మ తొమ్మిదో స్థానంలో.. బంగ్లా సిరీస్‌లో విఫలమైన కోహ్లి రెండు స్థానాలు దిగజారి 14వ స్థానంలో ఉండగా.. బంగ్లాతో సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైన పుజారా కూడా మూడు స్థానాలు దిగజారి 19వ స్థానంలో నిలిచాడు.
చదవండి: కోహ్లి తప్పుకున్నాడు సరే.. రోహిత్, రాహుల్ సంగతేంటి?
Comments
Please login to add a commentAdd a comment