టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉదయం ద్రవిడ్ చికిత్స కోసం కోల్‌కతా నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. అదే సమయంలో భారత ఆటగాళ్లతో పాటు శ్రీలంక జట్లు, సహాయక సిబ్బంది మూడో వన్డే కోసం తిరువనంతపురం బయలుదేరింది. స్వల్ప ఆరోగ్య సమస్యలతో శుక్రవారం తెల్లవారు జామున కోల్‌కతా నుంచి బెంగళూరుకు విమానంలో బయలుదేరాడు.
ద్రవిడ్ బ్లడ్ ప్రెజర్(బీపీ) సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. కోల్‌కతాలో వైద్యులు పరీక్షించిన అనంతరం అతను బెంగళూరుకు బయలుదేరాడు. ప్రస్తుతం ద్రవిడ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నాడని..పరీక్షల అనంతరం శనివారం జట్టుతో చేరే అవకాశాలున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో బెంగళూరు విమానంలో ద్రవిడ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఇప్పటికే 2-0తో సొంతం చేసుకున్న టీమిండియా తిరువనంతపురం వేదికగా జరగనున్న మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తుంది. మరోవైపు షనక నేతృత్వంలోని లంక మాత్రం కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఆశిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment