
Rahul Dravid- Wriddhiman Saha: టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేసిన వ్యాఖ్యలపై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. అతడి మాటలు తననేమీ బాధించలేదని, ఇప్పటికీ సాహా పట్ల తన మనసులో గౌరవం అలాగే ఉందన్నాడు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలు, ఆటగాడిగా అందుకున్న విజయాలే ఇందుకు కారణమని పేర్కొన్నాడు. కాగా శ్రీలంకతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు ప్రకటించిన జట్టులో సాహాకు చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన అతడు.. ద్రవిడ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు రిటైర్మెంట్ గురించి ఆలోచించమని ఆయన సలహా ఇచ్చాడని ఆరోపించాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నుంచి తనకు హామీ ఉన్నప్పటికీ జట్టులో స్థానం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో సాహా వ్యాఖ్యలపై స్పందించిన ద్రవిడ్... ‘‘భారత క్రికెట్ విజయాల్లో తను భాగం అయ్యాడు. తన పట్ల నాకు గౌరవం ఉంది. ఈ క్రమంలోనే తనతో మాట్లాడాను. అయితే, అతడికి ఈ విషయంలో క్లారిటీ అవసరం.
నిజానికి అందరు ఆటగాళ్లతో ఎప్పుడూ మాట్లాడినట్లుగానే మాట్లాడాను. కాస్త నిజాయితీగా వ్యవహరించాల్సింది. మీడియా ద్వారా ఈ మాటలు వినాల్సి వస్తుందని అనుకోలేదు. అయినా ప్రతిసారి మనం ఇచ్చిన సలహాలు, సందేశాలు ప్రతి ఆటగాడికి నచ్చాలని లేదు కదా! అందుకే తన మాటలకు ఎక్కువగా బాధపడలేదు. మన అభిప్రాయాలతో ఏకీభవించని కారణంగా వాళ్లను తప్పుపట్టాల్సింది కూడా ఏమీలేదు’’ అని పేర్కొన్నాడు.
అదే విధంగా జట్టు ఎంపిక విషయంలో తాను, కెప్టెన్ రోహిత్ శర్మ వ్యవహరించే తీరు గురించి చెబుతూ... ‘‘జట్టు ఎంపిక విషయంలో నేను లేదంటే... రోహిత్... ఆటగాళ్లతో కచ్చితంగా మాట్లాడతాం. వాళ్లు ఎందుకు తుది జట్టులో లేరో.. అందుకు గల కారణాలు వివరిస్తాం. సెలక్ట్ అవ్వని వాళ్లు బాధకు లోనుకావడం సహజమే. అయినా, వాళ్ల పట్ల నాకున్న గౌరవం ఏమాత్రం తగ్గదు. నా జట్టు పూర్తి నిజాయితీ, క్లారిటీ కలిగి ఉండాలని నేను కోరుకుంటాను’’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.
చదవండి: IPL 2022: ఐపీఎల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచి అంటే!