![ICC World Cup 1999: When Ganguly Hits 183 Dravid 145 Against Sri Lanka - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/26/dravid-ganguly.jpg.webp?itok=t16U1Bko)
Courtesy: Reuters
వెబ్‌డెస్క్: 22 ఏళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు... టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ఐసీసీ వన్డే వరల్డ్ కప్-1999లో ఆడిన వీరోచిత ఇన్నింగ్స్‌ను క్రీడాభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన గంగూలీ 158 బంతుల్లో 183 పరుగులు చేస్తే... వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన ద్రవిడ్... 129 బంతుల్లో 145 పరుగులు చేసి అదరగొట్టాడు. ఫలితంగా మహ్మద్ అజారుద్దీన్ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకపై 157 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
టాంటన్ హీరోలు..
ఐసీసీ వన్డే వర్‌ల్డ్ కప్-1999లో భాగంగా ఇంగ్లండ్‌లోని టాంటన్‌లో జరిగిన మ్యాచ్‌లో, టాస్ గెలిచిన శ్రీలంక టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో, చమిందా వాస్ బౌలింగ్‌లో ఓపెనర్ సదగొప్పన్ రమేశ్ 5 పరుగులకే అవుట్ కాగా... ద్రవిడ్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికే నిలకడగా ఆడుతున్న గంగూలీ చెలరేగి ఆడటం మొదలుపెట్టాడు. మరో ఎండ్ నుంచి సహకారం అందిస్తూనే.. ద్రవిడ్ సైతం దూకుడు ప్రదర్శిస్తూ బౌండరీల వర్షం కురిపించాడు.
తొలిసారిగా..
తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి 300 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా గంగూలీ- ద్రవిడ్ ద్వయం నిలిచింది. 44.5 ఓవర్లలో వీరిద్దరు 318 పరుగులు జోడించారు. గంగూలీ 17 ఫోర్లు, 7 సిక్సర్లు బాదగా, ద్రవిడ్ 17 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అలరించాడు. ఇక విక్రమ సింఘే బౌలింగ్‌లో గంగూలీ పెవిలియన్ చేరడం, ముత్తయ్య మురళీధరన్ అద్భుత త్రోకు ద్రవిడ్ రనౌట్ కావడంతో సూపర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ఈ మ్యాచ్‌లో సచిన్ 2, అజయ్ జడేజా 5, రాబిన్ సింగ్ 0.. అత్యల్ప స్కోర్లకే పరిమితమై పూర్తిగా విఫలం కాగా, కెప్టెన్ అజారుద్దీన్ 12 పరుగులు(నాటౌట్) చేశాడు. లంక బౌలర్లలో ప్రమోద్య విక్రమ సింఘే అత్యధికంగా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
రాబిన్ సింగ్ విశ్వరూపం
ఇక శ్రీలంకకు 374 పరుగుల లక్ష్యం విధించిన భారత్.. రాబిన్ సింగ్ విశ్వరూపం ప్రదర్శించడంతో సునాయాసంగా విజయం సాధించగలిగింది.157 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో రాబిన్ సింగ్ 5 వికెట్లు పడగొట్టగా, శ్రీనాథ్, అనిల్ కుంబ్లే, మొహంతి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా ఈ మెగా టోర్నీలో గ్రూపు స్టేజ్‌లో మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. సూపర్ 8లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. ఆ ఏడాది ఆస్ట్రేలియా ప్రపంచకప్ విజేతగా నిలిచింది.
చదవండి: World Cup Super League: భారీ విజయం.. టాప్‌లో బంగ్లాదేశ్!
Comments
Please login to add a commentAdd a comment