
న్యూఢిల్లీ: చివరి వికెట్ తీయడంలో విఫలమైన ఆంధ్ర జట్టు బౌలర్లు ఢిల్లీ జట్టుతో జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయారు. మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా 29 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించినందుకు ఢిల్లీ జట్టుకు మూడు పాయింట్లు లభించగా... ఆంధ్ర ఖాతాలో ఒక పాయింట్ మాత్రమే చేరింది.
ఓవర్‌నైట్ స్కోరు 300/4తో ఆట చివరిరోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఢిల్లీ జట్టు 9 వికెట్లకు 488 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్లలో ధ్రువ్ షోరే మరో 43 పరుగులు జోడించి వ్యక్తిగత స్కోరు 185 వద్ద అవుటవ్వగా... హిమ్మత్ సింగ్ (104; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హిమ్మత్ సింగ్ అవుటైనపుడు ఢిల్లీ స్కోరు 423/9. చివరి వికెట్ తీసిఉంటే ఆంధ్ర జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతోపాటు మూడు పాయింట్లు లభించేవి.
కానీ ఢిల్లీ బ్యాటర్లు హర్షిత్ రాణా (46 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), దివిజ్ మెహ్రా (38 బంతుల్లో 32 నాటౌట్; 6 ఫోర్లు) మొండి పట్టుదలతో ఆడి చివరి వికెట్‌కు అజేయంగా 65 పరుగులు జోడించారు. ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆంధ్ర గ్రూప్ ‘బి’ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment