Ranji Trophy 2022-23 - Saurashtra vs Punjab: రంజీ ట్రోఫీ 2022-2023 సీజన్‌లో ఆఖరి సెమీ ఫైనలిస్టు ఖరారైంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ , బెంగాల్, కర్ణాటక సెమీస్ బెర్తు ఖరారు చేసుకోగా.. తాజాగా సౌరాష్ట్ర ఫైనల్ ఫోర్ జాబితాలో చేరింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్-2లో పంజాబ్‌ను చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది.
పార్థ్ భట్ అద్భుత ఇన్నింగ్స్
సొంత మైదానం సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్‌తో తలపడింది అర్పిత్ వసవాడ సేన. జనవరి 31న మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ స్నెల్ పటేల్ 70 పరుగులతో రాణించగా.. పార్థ్ భట్ 111 పరుగులతో అజేయంగా నిలిచాడు.
మిగతా వాళ్లంతా చేతులెత్తేసినా ఒంటరి పోరాటం చేశాడు. దీంతో 303 పరుగుల వద్ద సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ ముగిసింది. పంజాబ్ బౌలర్లలో మార్కండే నాలుగు, బల్జీత్ సింగ్ 3, సిద్దార్థ్ కౌల్ 2, నామన్ ధిర్ ఒక వికెట్ పడగొట్టారు.
అదరగొట్టారు.. అయినా
ఇక పంజాబ్‌కు ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్(126), నామన్ ధిర్(131) అదిరిపోయే ఆరంభం అందించారు. నాలుగో స్థానంలో వచ్చిన మన్‌దీప్ (91) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ అన్మోల్ మల్హోత్రా 41 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 431 పరుగులకు ఆలౌట్ అయిన పంజాబ్.. సౌరాష్ట్రపై తొలి ఇన్నింగ్స్‌లో వంద పరుగుల పైచిలుకు ఆధిక్యం సాధించగలిగింది.
5 వికెట్లతో చెలరేగిన పార్థ్ భట్
ఈ క్రమంలో సౌరాష్ట్ర 379 పరుగులకు రెండో ఇన్నింగ్స్ ముగించింది. దీంతో పంజాబ్‌ను కట్టడి చేయాలని భావించిన సౌరాష్ట్రకు బౌలింగ్ ఆల్‌రౌండర్ పార్థ్ భట్ ఊతంగా నిలిచాడు. ఏకంగా 5 వికెట్లతో(33 ఓవర్లలో 89 పరుగులు) చెలరేగి పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ధర్మేంద్ర జడేజా మూడు, యువరాజ్‌సిన్హ్ దోడియా రెండు వికెట్లతో రాణించారు.
కర్ణాటకతో అమీతుమీ
సౌరాష్ట్ర బౌలర్ల విజృంభణతో పంజాబ్ రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శనివారం 71 పరుగుల తేడాతో విజయఢంకా మోగించిన సౌరాష్ట్ర.. సెమీస్‌కు దూసుకెళ్లింది. ఫైనల్ చేరే క్రమంలో కర్ణాటకతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటి సౌరాష్ట్రను గెలిచిన పార్థ్ భట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్-2 సౌరాష్ట్ర వర్సెస్ పంజాబ్ స్కోర్లు
సౌరాష్ట్ర- 303 & 379
పంజాబ్- 431 & 180
చదవండి: షాహీన్‌తో కుమార్తె వివాహం.. ఆఫ్రిది భావోద్వేగం! ట్వీట్ వైరల్
Gill-Kohli: 'నీకు పదేళ్లు ఇస్తా.. సగం అయినా పట్టగలవేమో చూస్తా'
Comments
Please login to add a commentAdd a comment