8 వికెట్లతో చెలరేగిన భువనేశ్వర్ కుమార్ (PC: JioCinema)
Ranji Trophy 2024- Bhuvneshwar Kumar: దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత రంజీల్లో పునరాగమనం చేసిన టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లోనే ఏకంగా ఎనిమిది వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 8/41 (22 ఓవర్లు)తో కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
60 పరుగులకే ఆలౌట్
దేశవాళీ క్రికెట్‌లో తన సొంత జట్టు ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భువీ బెంగాల్‌తో మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. కాన్పూర్‌లో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత ఫీల్డింగ్‌కు దిగింది. యూపీ జట్టును కేవలం 60 పరుగులకే ఆలౌట్ చేసి దిమ్మతిరిగేలా షాకిచ్చింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ జోరుకు భువీ అడ్డుకట్ట వేయగలిగాడు.
తొలి రోజే ఐదు వికెట్లు కూల్చాడు
ఈ రైటార్మ్ పేసర్ దెబ్బకు ఓపెనర్ సౌరవ్ పాల్ 13 పరుగులకే పరిమితం కాగా.. సుదీప్ కుమార్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇతర ఆటగాళ్లలో అనుస్తుప్ మజుందార్(12), కెప్టెన్ మనోజ్ తివారి(3), అభిషేక్ పోరెల్(12)లు కూడా భువీకే వికెట్ సమర్పించుకుని పెవిలియన్ చేరారు.
దీంతో తొలి రోజు ఆట ముగిసే సరికే భువీ ఖాతాలో ఐదు వికెట్లు చేరాయి. భువీ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం ఇది 13వసారి. ఈ క్రమంలో 95/5 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన బెంగాల్ 188 పరుగులకు ఆలౌట్ అయింది.
మొత్తం ఎనిమిది వికెట్లు
రెండో రోజు ఆటలో.. 41 పరుగులతో నిలకడగా ఆడుతున్న ఓపెనర్ శ్రేయాన్ష్ ఘోష్‌ను పెవిలియన్‌కు పంపిన భువీ.. ప్రదీప్త ప్రమాణిక్(1), సూరజ్ సింధు జైస్వాల్(20)లను కూడా అవుట్ చేశాడు. దీంతో భువీ ఖాతాలోని వికెట్ల సంఖ్య ఎనిమిది చేరింది.
ఇక కరణ్ లాల్(12), ఇషాన్ పోరెల్(10) రూపంలో మరో రెండు వికెట్లను లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాల్ దక్కించుకున్నాడు. బెంగాల్ ఆలౌట్ అయిన తర్వాత మళ్లీ బ్యాటింగ్ ఆరంభించిన ఉత్తరప్రదేశ్ జట్టు శనివారం ఆట పూర్తయ్యేసరికి 18 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. సమర్థ్ సింగ్ 21, ఆర్యన్ జుయాల్ 20 రన్స్‌తో క్రీజులో ఉన్నారు.
అదే ఆఖరు.. రీఎంట్రీ ఎప్పుడో?!
ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్-2022 ముగిసిన తర్వాత భువనేశ్వర్ కుమార్‌కు జట్టులో ప్రాధాన్యం లేకుండా పోయింది. 2022, నవంబరులో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌లో ఈ సీమర్ ఆఖరిసారిగా టీమిండియాకు ఆడాడు.
వరుస వైఫల్యాల నేపథ్యంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతడిని తప్పించింది. ఈ క్రమంలో 33 ఏళ్ల భువీకి జట్టులో చోటు కరువైంది. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లతో పాటు యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్‌లతో పోటీలో అతడు వెనుకబడిపోయాడు. ప్రస్తుతం దేశవాళీ, లీగ్ క్రికెట్‌కే పరిమితమైన భువనేశ్వర్ కుమార్ తాజాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు.
ఈ నేపథ్యంలో ఇప్పటికైనా భువీ ప్రదర్శన ఆధారంగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అతడిని ఎంపిక చేయాలని అభిమానులు బీసీసీఐ సెలక్టర్లకు సూచిస్తున్నారు. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లకు జట్టును ప్రకటించినప్పటికీ.. మిగిలిన మూడు టెస్టులకైనా అతడిని పరిగణనలోకి తీసుకుంటే బాగుండని ఆకాంక్షిస్తున్నారు.
చదవండి: INDA Vs ENGA: శతక్కొట్టిన పాటిదార్.. పాపం సర్ఫరాజ్! భరత్ ఫిఫ్టీ..
.@BhuviOfficial on fire 🔥
— BCCI Domestic (@BCCIdomestic) January 12, 2024
A five-wicket haul and he's taken all 5⃣ Bengal wickets to fall so far. What a splendid spell 👌👌@IDFCFIRSTBank | #RanjiTrophy | #UPvBEN
Follow the match ▶️ https://t.co/yRqgNJxmLY pic.twitter.com/Dqu0OgJMk0
Comments
Please login to add a commentAdd a comment