టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ రంజీ బరిలో దిగనున్నాడు. సొంత రాష్ట్రం కేరళ తరఫున రెడ్‌బాల్ టోర్నీలో పాల్గొననున్నాడు. అయితే, ఈసారి కెప్టెన్‌గా గాకుండా కేవలం వికెట్ కీపర్ బ్యాటర్‌గానే ఆడనున్నాడు. ఇందుకు కారణం ఏమిటంటే..?
టెస్టుల్లో అరంగేట్రం చేయాలని ఉందని సంజూ శాంసన్ ఇటీవల తన మనసులోని మాట వెల్లడించిన విషయం తెలిసిందే. మేనేజ్‌మెంట్ సైతం ఇందుకు సుముఖంగా ఉందని పరోక్షంగా తెలిపాడు. యాజమాన్యం సూచనల మేరకే తాను దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగానన్నాడు సంజూ.
ఇక ఆ టోర్నీలో విధ్వంసకర శతకంతో ఆకట్టుకున్న సంజూ శాంసన్.. తదుపరి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా టీమిండియాతో చేరాడు. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్ మూడో మ్యాచ్‌లో సెంచరీతో దుమ్ములేపాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి టీమిండియా 3-0తో బంగ్లాను క్లీన్‌స్వీప్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.
కారణం ఇదే
ఈ నేపథ్యంలో ఇటీవల ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. తాను త్వరలోనే టెస్టుల్లో అరంగేట్రం చేస్తాననే సంకేతాలు ఇచ్చాడు. ఇందుకు రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో అతడు రాణించాల్సి ఉంది. అయితే, గత ఎడిషన్‌లో కేరళ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంజూ ఈసారి.. సారథ్య బాధ్యతలకు దూరమయ్యాడు. టీమిండియా నవంబరులో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుండటమే ఇందుకు కారణం.
రంజీ తాజా ఎడిషన్‌లో సచిన్ బేబీ సారథ్యంలో కేరళ తొలుత పంజాబ్‌తో మ్యాచ్ ఆడి.. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తదుపరి శుక్రవారం నుంచి కర్ణాటకతో తలపడేందుకు సిద్ధం కాగా.. అవుట్‌ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా టాస్ ఆలస్యమైంది. ఇదిలా ఉంటే.. టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్ కారణంగా సంజూ కొన్ని రంజీ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఉత్తరప్రదేశ్(నవంబరు 6-9), హర్యానా(నవంబరు 13- 16)తో కేరళ ఆడే మ్యాచ్‌లకు సంజూ అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ సమయంలో (నవంబరు 8 నుంచి) టీమిండియా టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికాకు వెళ్లనుంది. అందుకే సంజూ కేరళ జట్టు కెప్టెన్సీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: IND Vs NZ 1st Test: పాపం రోహిత్ శర్మ!.. ఆనందం ఆవిరి.. అన్‌లక్కీ భయ్యా!
Comments
Please login to add a commentAdd a comment