PC: IPL Twitter
ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (మే 12) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ బ్యాట్‌తో చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. తన జట్టు గెలుపుపై ఆశలు వదులుకున్న తరుణంలో బరిలోకి దిగిన ఈ ఆఫ్ఘానీ.. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది ముంబై బౌలర్ల భరతం పట్టాడు. కేవలం 32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ క్రమంలో రషీద్ పలు ఐపీఎల్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో ఎనిమిది అంతకంటే తక్కువ స్థానంలో బరిలోకి దిగి అత్యధిక స్కోర్ (79 నాటౌట్) సాధించిన ఆటగాడిగా.. అలాగే అత్యధిక సిక్సర్లు (10) బాదిన టెయిలెండర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో టెయిలెండర్‌గా దిగి అత్యధిక స్కోర్ సాధించిన రికార్డు పాట్ కమిన్స్ పేరిట ఉండేది. 2021 సీజన్‌లో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్ ఎనిమిదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగి 34 బంతుల్లో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఇక, గుజరాత్-ముంబై మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. సూర్యకుమార్ (49 బంతుల్లో 103 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్సర్లు) శివతాండవం చేయడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్యాట్ విధ్వంసం సృష్టించకముందు రషీద్ ఖాన్ బంతితో (4/30) ముంబైను దెబ్బకొట్టాడు. సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ఉండకపోయినట్లైతే ముంబై తక్కువ స్కోర్‌కే పరిమతమయ్యేది. 219 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆదిలోనే తడబడిన గుజరాత్.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోతూ ఓటమికి దగ్గరైంది. అయితే రషీద్ ఖాన్ మాత్రం ఓ పక్క వికెట్లు పడుతున్నా, తన పని బాదడమే అన్నట్లు చెలరేగిపోయి, ఓడినా తన జట్టు రన్‌రేట్ ఎక్కడా తగ్గకుండా చేశాడు.
చదవండి: IPL 2023 GT vs MI: మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్ సూర్యకుమార్ కాదు.. అతడే!
Comments
Please login to add a commentAdd a comment