ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్ రూపంలో మరో మెగా ఈవెంట్ క్రికెట్ ప్రేమికుల ముందుకు రానుంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ టోర్నీకి తెరలేవనుంది. ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ ఇండియాతో పాటు.. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ టోర్నీకి అర్హత సాధించాయి.
మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగనుంది. ఈవెంట్ ఆరంభానికి సమయం సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే ఆయా దేశాల బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి(Ravi Shastri), ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్(Ricky Ponting) చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేశారు.
సెమీస్, ఫైనల్ చేరే జట్లు ఇవే!
ఐసీసీ రివ్యూ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా.. టీమిండియా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్‌కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. ఇందుకు పాంటింగ్ బదులిస్తూ.. ‘‘ఇండియా- ఆస్ట్రేలియాను దాటుకుని వేరే జట్లు పైకి వెళ్లడం ఈసారీ కష్టమే.
ఎందుకంటే.. ప్రస్తుతం ఇరు దేశాల జట్లలో నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాళ్లు మెండుగా ఉన్నారు. ఇటీవల ఐసీసీ ఈవెంట్లలో ఈ జట్లు సత్తా చాటిన తీరే ఇందుకు నిదర్శనం. కాబట్టి ఈ రెండు ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది’’ అని అంచనా వేశాడు.
కానీ పాకిస్తాన్‌తో జాగ్రత్త
అయితే, ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌ను కూడా తక్కువ అంచనా వేయవద్దని రిక్కీ పాంటింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ‘‘ఇటీవలి కాలంలో నిలకడగా ఆడుతున్న జట్టు ఏదైనా ఉందంటే.. అది పాకిస్తాన్. వన్డే క్రికెట్లో ప్రస్తుతం వారి ప్రదర్శన అద్బుతంగా ఉంది.
ఐసీసీ వంటి ప్రధాన టోర్నమెంట్లలో వారి ఆటతీరు ఒక్కోసారి అంచనాలకు భిన్నంగా ఉంటుంది. ఈసారి మాత్రం ప్రతికూలతలన్నీ అధిగమించే అవకాశం ఉంది’’ అని రిక్కీ పాంటింగ్ మిగతా జట్లను హెచ్చరించాడు. కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరిగింది. నాటి ఫైనల్లో టీమిండియాను ఓడించి పాకిస్తాన్ టైటిల్ గెలిచింది.
ఇదిలా ఉంటే.. ఈ ఐసీసీ టోర్నీలో ఆస్ట్రేలియా రెండుసార్లు చాంపియన్‌గా నిలిచింది. రిక్కీ పాంటింగ్ సారథ్యంలో 2006, 2009లొ ట్రోఫీని కైవసం చేసుకుంది. మరోవైపు.. టీమిండియా 2013లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
ఇక పాకిస్తాన్‌లో చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లడం లేదు. ఐసీసీ అనుమతితో హైబ్రిడ్ విధానంలో దుబాయ్ వేదికగా తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనున్న రోహిత్ సేన.. తదుపరి ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం.. మార్చి రెండున న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడుతుంది.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా(ఫిట్‌నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.
ట్రావెలింగ్ రిజర్వ్స్: ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి.
Comments
Please login to add a commentAdd a comment