Photo Credit: Twitter
పాకిస్తాన్‌లోని రావల్పిండి అడియాలా జైలులో శిక్షను అనుభవిస్తున్న ఆ దేశ మాజీ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పట్ల అక్కడి ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరుపై భారత దిగ్గజ ఆటగాడు రవిశాస్త్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లో ఉంచిన విధానం అమానుషంగా ఉందని పేర్కొన్నాడు. పాక్‌కు 1992 వన్డే ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్‌ను ప్రస్తుత ప్రభుత్వం పశువు కంటే హీనంగా చూడడం దారుణమని వాపోయాడు.
రవిశాస్త్రి మాట్లాడుతూ.."నేను రాజకీయ నాయకుడిని కాను. కానీ, ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కొంటున్న పరిస్థితులు నన్ను షాక్‌కు గురిచేస్తున్నాయి. ఏ మనిషినీ కూడా ఇంత దారుణంగా చూడకూడదు. ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గొప్ప క్రికెటర్. అలాగే గతంలో పాకిస్తాన్‌కు ప్రధానిగా వ్యవహరించారు.
ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం బాగా క్షీణించిందని వార్తలు వస్తున్నాయి. జైలు పరిస్థితుల వల్ల ఆయన కుడి కంటి చూపు దాదాపు 85% తగ్గిపోయిందని (కేవలం 15% చూపు మాత్రమే మిగిలి ఉందని) వచ్చిన నివేదికలు నన్ను దిగ్భ్రాంతికి గురి చేశాయి.’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
1992లో పాకిస్తాన్‌కు ప్రపంచ కప్ అందించిన ఇమ్రాన్ ఖాన్‌ను "లీడర్ ఆఫ్ మెన్" (నాయకులను నడిపించే నాయకుడు) గా రవిశాస్త్రి కొనియాడాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా జట్టును నడిపించగల అద్భుతమైన నైపుణ్యం ఆయనకు ఉందని గుర్తుచేసుకున్నాడు. పాకిస్తాన్ సైనిక వ్యవస్థ, ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యల వల్ల 2023 నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలులోనే గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కనీస హక్కుగా సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని రవిశాస్త్రి డిమాండ్ చేశాడు.
ఇక పాకిస్తాన్ మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు 5 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విదేశీ ప్రముఖుల నుండి పొందిన ఖరీదైన బహుమతులను (గడియారాలు, ఆభరణాలు వంటివి) తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఎక్కువ ధరకు అమ్మారనే ఆరోపణలపై (తోషాఖానా కేసు) ఇమ్రాన్ ఖాన్‌కు జైలు శిక్ష పడింది.
ఇదీ చదవండి: ముంబై జట్టు ప్రకటన.. సూర్యకుమార్‌కు షాక్!


