పీసీబీ చైర్మన్.. మాజీ క్రికెటర్ రమీజ్ రాజాకు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. టీమిండియా, పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగి చాలా కాలమైపోయింది. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరుజట్లు తలపడుతూ వస్తున్నాయి. కాగా ఐసీసీ లాంటి మేజర్ టోర్నీల్లో టీమిండియాకు పాక్‌పై మంచి రికార్డు ఉంది. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను పాక్ ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. అయితే గతేడాది టి20 ప్రపంచకప్‌లో మాత్రం టీమిండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఒక్క విజయాన్ని దృష్టిలో పెట్టుకొని రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
''ఐసీసీ టోర్నీల్లో ఇండియాతో మ్యాచ్ అంటే ఎప్పుడూ పాకిస్తాన్ అండర్ డాగ్‌గానే ఉండేది. ప్రెషర్ తీసుకుని ఇండియాతో మ్యాచుల్లో ఓడిపోతూ వచ్చేవాళ్లం. కొన్నాళ్లకు ఐసీసీ టోర్నీల్లో ఇండియాని ఓడించగలమా? అనే అనుమానం కూడా మాలో మొదలైంది...టీమిండియాని ఓడించలేం... అని చాలామంది ఫిక్స్ అయిపోయారు కూడా. అయితే గత వరల్డ్ కప్‌లో దాన్ని సాధించాం. టీమిండియాని ఓడించి అద్భుతం క్రియేట్ చేశాం. అది అనుకోకుండా వచ్చిన విజయమే కావచ్చు కానీ అందులో మాకు క్రెడిట్ దక్కాల్సిందే... ఎందుకంటే టీమిండియా బిలియన్ డాలర్ టీమ్ క్రికెట్ ఇండస్ట్రీ'' అంటూ పేర్కొన్నాడు.
కాగా రమీజ్ వ్యాఖ్యలపై స్పందించిన అశ్విన్.. ''రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు విని షాక్ అయ్యా.ఈ విషయాన్ని డీల్ చేసే విధానం ఇదేనా. క్రికెట్ గేమ్‌లో గెలుపు ఓటమలు సహజం. పొలిటికల్ టెన్షన్స్ కారణం కావచ్చు, మరేదైనా కారణం భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఆ రేంజ్ వేరుగా ఉంటుంది...రెండు జట్ల మధ్య మ్యాచ్‌లా కాకుండా రెండు దేశాల మధ్య పోరాటం చూస్తారు చాలా మంది. అయితే ఓ క్రికెటర్‌గా ఆటలో గెలుపు ఎంత సహజమో, ఓటమి కూడా అంతే అనే విషయం నాకు బాగా తెలుసు.
అందులోనూ టీ20ల్లో ఎవరు ఎప్పుడు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం. క్రెడిట్, గౌరవం అనేవి అడిగి తీసుకుంటే వచ్చేవి కాదు. గెలుపు ఓటములతో గౌరవం దక్కదు. ప్రత్యర్థితో మనం ఎలా ఉంటున్నాం, ఎలా వ్యవహరిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం.. అనేదాన్ని బట్టి గౌరవం దక్కుతుంది. ఒక క్రికెటర్‌గా, నా ప్రత్యర్థి జట్టును నేను గౌరవిస్తా. అది పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ కావచ్చు... అయితే దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్లపైనే ఉంది'' అంటూ పేర్కొన్నాడు.
ఇక ఇప్పటికే టీమిండియా ఆస్ట్రేలియా చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. సూర్యకుమార్ తన ఫామ్‌ను కంటిన్యూ చేయగా.. రోహిత్ శర్మ విఫలమయ్యాడు. ఇక పాకిస్తాన్ న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో ట్రై సిరీస్ ఆడేందుకు కివీస్ గడ్డపై అడుగుపెట్టింది. ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 23న(ఆదివారం) జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment