‘టీమిండియా స్టార్‌ రవీంద్ర జడేజాకు సన్మానం’ | Jadeja, Pujara to be Felicitated Ahead of Ind vs Eng 3rd Test - Sakshi
Sakshi News home page

Ind vs Eng: మూడో టెస్టుకు ముందు జడేజా, పుజారాలకు సన్మానం.. ఎందుకంటే?

Published Mon, Feb 12 2024 2:05 PM | Last Updated on Mon, Feb 12 2024 3:04 PM

Ravindra Jadeja Pujara to be Felicitated Ahead of Ind vs Eng 3rd Test - Sakshi

Ind vs Eng Test Series 2024: ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య రాజ్‌కోట్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. కాగా స్వదేశంలో భారత్‌ ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ‘బజ్‌బాల్‌’ అంటూ దూకుడు ప్రదర్శించిన ఇంగ్లండ్‌ అనూహ్య రీతిలో విజయం సాధించింది. 28 పరుగుల తేడాతో గెలుపొంది బోణీ కొట్టింది. ఈ క్రమంలో వైజాగ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా ఇందుకు బదులు తీర్చుకుంది.

బదులు తీర్చుకున్న టీమిండియా
డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో జరిగిన టెస్టులో రోహిత్‌ సేన స్టోక్స్‌ బృందాన్ని 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఫలితంగా సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమమైంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15 నుంచి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఆరంభమయ్యే మూడో టెస్టు టీమిండియా- ఇంగ్లండ్‌లకు కీలకంగా మారింది.

సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. కాగా టీమిండియా స్టార్లు ఛతేశ్వర్‌ పుజారా, రవీంద్ర జడేజాలకు ఇది సొంతమైదానం. ఈ నేపథ్యంలో సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఎస్‌సీఏ) కీలక ప్రకటన చేసింది.

ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ముందు ఈ ఇద్దరు క్రికెటర్లను సన్మానించనున్నట్లు తెలిపింది. ఎస్‌సీఏ అధ్యక్షుడు జయదేవ్‌ షా ఈ విషయాన్ని వెల్లడించాడు. భారత క్రికెట్‌కు పుజారా, జడేజా చేస్తున్న సేవలకు గానూ వారిని సముచితంగా గౌరవించనున్నట్లు తెలిపాడు.

100 టెస్టుల వీరుడు
టీమిండియా నయవాల్‌గా పేరొందిన ఛతేశ్వర్‌ పుజారా వందకు పైగా టెస్టులు ఆడాడు. తద్వారా ఈ ఘనత సాధించిన పదమూడో భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతర్జాతీయ టెస్టుల్లో టీమిండియా సాధించిన పలు చారిత్రాత్మక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ప్రస్తుతం జట్టులో చోటు కోల్పోయినా.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో సౌరాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీ-2024లో అదరగొడుతున్నాడు.

అన్ని ఫార్మాట్లలో ఆల్‌రౌండర్‌గా జడేజా
టెస్టుల్లో ప్రపంచ నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా ఉన్న రవీంద్ర జడేజా.. టీమిండియాకు అన్ని ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు.. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు.

హోంగ్రౌండ్‌లో జరిగే మూడో మ్యాచ్‌కు జడ్డూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కెరీర్‌ పరంగా ఇలా జడేజా గొప్ప స్థాయిలో ఉండగా.. అతడి తండ్రి అనిరుద్‌సిన్హ జడేజా.. జడ్డూతో తమకు కొన్నేళ్లుగా మాటలే లేవంటూ సంచలన ఆరోపణలు చేశాడు. కోడలి వల్లే ఇలా జరుగుతోందంటూ ఇంటిగుట్టును రచ్చకెక్కించాడు.

చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement