15.4 ఓవర్లలోనే 202 పరుగుల లక్ష్యఛేదన
6 వికెట్ల తేడాతో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్
కోహ్లి, పడిక్కల్ మెరుపులు
ఇషాన్ పోరాటం వృథా
బ్యాటింగ్‌లో ఆశించినంత భారీ స్కోరు చేయలేకపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్... బౌలింగ్‌లో ఎలాంటి మ్యాజిక్ కనబర్చలేక పరాజయంతో ఐపీఎల్‌ను ప్రారంభించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... చాంపియన్ ఆటతీరుతో సీజన్‌లో బోణీ కొట్టింది. జాకబ్ డఫీ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొడితే... షెఫర్డ్ అతడికి సంపూర్ణ సహకారం అందించాడు. వీరిద్దరి బౌలింగ్ మెరుపులకు... ఫిల్ సాల్ట్ ఫీల్డింగ్ విన్యాసాలు తోడవడంతో సన్‌రైజర్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ‘ఛేజ్ మాస్టర్’ విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్ దూకుడుతో మరో 26 బంతులు మిగిలుండగానే బెంగళూరు లక్ష్యాన్ని ఛేదించింది.
బెంగళూరు: సొంతగడ్డపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్‌ను ఘన విజయంతో ప్రారంభించింది. శనివారం జరిగిన టోర్నీ ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విజృంభించగా... అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. క్లాసెన్ (31; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... హెడ్ (11), అభిషేక్ శర్మ (7), నితీశ్ కుమార్ రెడ్డి (1), సలిల్ అరోరా (9), హర్ష్ దూబే (3) విఫలమయ్యారు.
బెంగళూరు బౌలర్లలో జేకబ్ డఫీ, రొమారియో షెఫర్డ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), దేవదత్ పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకాలతో అదరగొట్టగా.. కెప్టెన్ రజత్ పాటీదార్ (12 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు దంచికొట్టాడు.
ఇషాన్ కెప్టెన్ ఇన్నింగ్స్
జాకబ్ డఫీ ధాటికి సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టిన సమయంలో ఇషాన్ చక్కటి ఇన్నింగ్స్‌తో అలరించాడు. కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అనూహ్యంగా జట్టు పగ్గాలు అందుకున్న ఇషాన్... బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టాడు. అభినందన్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో ఇషాన్ వరుసగా 6, 4, 6 కొట్టి మైదానంలో జోష్ నింపాడు. కాసేపటికి క్లాసెన్ కూడా రెండు ఫోర్లతో సత్తాచాటాడు.
సుయాశ్ శర్మ ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టిన ఇషాన్ 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కృనాల్ వేసిన 13వ ఓవర్‌లో ఈ ఇద్దరు కలిసి మూడు సిక్స్‌లు బాదారు. నాలుగో వికెట్‌కు 97 పరుగులు జోడించిన అనంతరం క్లాసెన్ వివాదాస్పద క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత హైదరాబాద్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా... అనికేత్ దూకుడు కొనసాగించడంతో సన్‌రైజర్స్ మెరుగైన స్కోరు చేయగలిగింది.
ఆడుతూ పాడుతూ...
దూకుడుకు మారుపేరైన ప్రత్యర్థి ఓ మాదిరి స్కోరుకే పరిమితం చేసిన బెంగళూరు... సొంతగడ్డపై దుమ్మురేపింది. సాల్ట్ (8) రెండో ఓవర్‌లోనే అవుటైనా... ఆ తర్వాత రైజర్స్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బెంగళూరు దంచికొట్టింది. మంచి ఫామ్‌లో ఉన్న పడిక్కల్ అలవోకగా భారీ షాట్‌లు ఆడుతూ లక్ష్యాన్ని కరిగించాడు. సిక్స్‌తో ఖాతా తెరిచిన అతడు... నితీశ్ రెడ్డి ఓవర్‌లో రెండు ఫోర్లు, పైన్ ఓవర్‌లో 6, 4, 6 బాదాడు. కోహ్లి కూడా 6, 4తో జోరు పెంచడంతో పవర్‌ప్లే ముగిసే సరికి బెంగళూరు 76/1తో నిలిచింది.
దూబే బౌలింగ్‌లో 4, 6 కొట్టిన అనంతరం పడిక్కల్ అవుటయ్యాడు. దీంతో 101 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్ రజత్ పాటీదార్ ఉన్నంతసేపు భారీ షాట్‌లతో చెలరేగడంతో... స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. బెంగళూరు విజయానికి 48 బంతుల్లో 40 పరుగుల అవసరమైన దశలో... వరుస బంతుల్లో పాటీదార్, జితేశ్ శర్మ (0) అవుటైనా... టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి కోహ్లి మిగిలిన పని పూర్తిచేశాడు.
హడలెత్తించిన డఫీ
న్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ ఇప్పటికే జాతీయ జట్టు తరఫున 48 టి20లు ఆడి 62 వికెట్లు తీశాడు. అయితే ఇప్పుడు తొలిసారి అతను ఐపీఎల్‌లో అడుగు పెట్టాడు. హేజల్‌వుడ్‌కు ప్రత్యామ్నాయంగా ఆర్‌సీబీ అతడిని తీసుకోగా, తన ఎంపికకు పూర్తి న్యాయం చేస్తూ సత్తా చాటాడు.
తన రెండో ఓవర్లోనే కీలక బ్యాటర్లు అభిషేక్, హెడ్‌లను వెనక్కి పంపిన అతను తర్వాతి ఓవర్లో నితీశ్‌ను అవుట్ చేసి పవర్‌ప్లేలోనే 3/17తో రైజర్స్ పని పట్టాడు. కేవలం 530 మంది జనాభా ఉండే ఎలాంటి సౌకర్యాలు లేని చిన్న ఊరిలో పుట్టిన డఫీ ప్రస్థానం కివీస్ క్రికెట్ వర్గాల్లో ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
మరో ఇద్దరు...
ఈ మ్యాచ్‌తో మరో ఇద్దరు భారత క్రికెటర్లు ఐపీఎల్‌లో అరంగేట్రం చేశారు. పేస్ బౌలర్ అభినందన్ సింగ్‌కు ఆర్‌సీబీ అవకాశమిచ్చింది. యూపీ టి20 లీగ్‌లో లక్నో ఫాల్కన్స్ తరఫున ఆడిన అతనికి సీనియర్ స్థాయిలో ఇదే తొలి అధికారిక టోర్నీ. గత సీజన్‌లోనూ ఆర్‌సీబీతోనే ఉన్నా మ్యాచ్ ఆడే చాన్స్ రాలేదు.

సన్‌రైజర్స్ తరఫున ఆడిన సలీల్ అరోరాకు కూడా ఇదే తొలి మ్యాచ్. పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల సలీల్ ముస్తాక్ అలీ టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లలో దాదాపు 200 స్ట్రయిక్ రేట్‌తో 358 పరుగులు చేశాడు. టోర్నీలో ఏకంగా 28 సిక్సర్లతో అదరగొట్టి ఐపీఎల్ చాన్స్ దక్కించుకున్నాడు.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్: హెడ్ (సి) సాల్ట్ (బి) డఫీ 11; అభిషేక్ (సి) జితేశ్ (బి) డఫీ 7; ఇషాన్ (సి) సాల్ట్ (బి) అభినందన్ 80; నితీశ్ రెడ్డి (సి) అభినందన్ (బి) డఫీ 1; క్లాసెన్ (సి) సాల్ట్ (బి) షెఫర్డ్ 31; సలిల్ అరోరా (సి) పడిక్కల్ (బి) సుయాశ్ 9; అనికేత్ వర్మ (సి) కోహ్లి (బి) షెఫర్డ్ 43; హర్ష్ దూబే (సి) పడిక్కల్ (బి) షెఫర్డ్ 3; హర్షల్ (సి) పడిక్కల్ (బి) భువనేశ్వర్ 0; డేవిడ్ పైన్ (నాటౌట్) 6; ఉనాద్కట్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–18, 2–23, 3–29, 4–126, 5–137, 6–155, 7–167, 8–174, 9–192. బౌలింగ్: డఫీ 4–0–22–3; భువనేశ్వర్ 4–0–31–1; అభినందన్ 3–0–38–1; షెఫర్డ్ 4–0–54–3; సుయాశ్ 3–0–28–1; కృనాల్ 2–0–26–0.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: సాల్ట్ (సి) క్లాసెన్ (బి) ఉనాద్కట్ 8; కోహ్లి (నాటౌట్) 69; పడిక్కల్ (సి) క్లాసెన్ (బి) హర్ష్ 61; పాటీదార్ (సి) హర్ష్ (బి) పైన్ 31; జితేశ్ (సి) ఉనాద్కట్ (బి) పైన్ 0; టిమ్ డేవిడ్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (15.4 ఓవర్లలో 4 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–9, 2–110, 3–163, 4–163. బౌలింగ్: నితీశ్ రెడ్డి 2–0–19–0; ఉనాద్కట్ 3–0–29–1; డేవిడ్ పైన్ 3–0–35–2; హర్ష్ దూబే 3–0–35–1; ఇషాన్ మలింగ 2–0–35–0; హర్షల్ 2.4–0–39–0.
ఐపీఎల్‌లో నేడు
ముంబై X కోల్‌కతా
వేదిక: ముంబై
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం


