PC: RCB X
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ).. మూడుసార్లు ఫైనల్ చేరినా ఒక్కసారి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ గెలవలేకపోయింది. ప్రత్యర్థి జట్ల ఎత్తులకు చిత్తై.. ఆఖరి మెట్టుపై బోల్తా పడి ట్రోఫీని చేజార్చుకుంది. దీంతో.. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచే టీమిండియా సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి(Virat Kohli) కెరీర్‌లో ఐపీఎల్ టైటిల్ లేని లోటు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది.
ఆర్సీబీ ముఖచిత్రంగా కోహ్లి
అయితే, ఈసారి మాత్రం ఆర్సీబీ తలరాత మారుతుందంటున్నాడు ఆ జట్టు హెడ్‌కోచ్ ఆండీ ఫ్లవర్(Andy Flower). అదే విధంగా కొత్త కెప్టెన్ గురంచి కూడా సంకేతాలు ఇచ్చాడు. కాగా ఆర్సీబీకి భారీ ఫాలోయింగ్ రావడానికి ప్రధాన కారణం కోహ్లినే అనడంలో సందేహం లేదు. తన ఇమేజీ ద్వారా ఆర్సీబీ ముఖచిత్రంగా మారిపోయిన ఈ రన్‌మెషీన్.. 2011లో తొలిసారి కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు.
ఆ తర్వాత రెండేళ్లకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమితుడైన కోహ్లి.. 2016లో జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. కానీ తుదిపోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయి.. రిక్తహస్తాలతో వెనుదిరిగింది. ఆ తర్వాత కూడా చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ భారాన్ని, పని ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో 2021లో సారథ్య బాధ్యతల నుంచి కోహ్లి వైదొలిగాడు.
డుప్లెసిస్ సారథ్యంలో
ఈ క్రమంలో సౌతాఫ్రికా వెటరన్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్(Faf Du Plesis) ఆర్సీబీ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 2024 వరకు నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాడు. అయితే, మెగా వేలానికి ముందు ఆర్సీబీ డుప్లెసిస్‌ను వదిలేసింది. ఆక్షన్ సమయంలోనే అతడిని కొనేందుకు ఆసక్తి చూపలేదు.
ఈ నేపథ్యంలో ఆర్సీబీకి ఐపీఎల్-2025లో కొత్త కెప్టెన్ రావడం ఖాయమైంది. అతడు మరెవరో కాదు.. కోహ్లినే అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై స్పోర్ట్స్‌తక్‌తో మాట్లాడిన ఆండీ ఫ్లవర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
నవశకం ఆరంభం
‘‘నవశకం ఆరంభం కాబోతోంది. మూడేళ్ల సైకిల్‌లో ఊహించిన ఫలితాన్ని రాబట్టబోతున్నాం. అందరూ అనుకున్నదే నిజమయ్యే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు అందుకు సంబంధించిన చర్చ జరుగలేదని మాత్రం చెప్పగలను’’ అని ఆండీ ఫ్లవర్ పేర్కొన్నాడు.
అదే సమయంలో.. కోహ్లికే మరోసారి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఆండీ ఫ్లవర్ సంకేతాలు ఇచ్చాడు. మరోవైపు.. ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మొ బొబాట్ సైతం కెప్టెన్సీ అంశం గురించి ఇంకా చర్చించలేదని చెప్పినా.. పరోక్షంగా కోహ్లి వైపే తాము మొగ్గుచూపే ఛాన్స్ ఉందని తెలియజేశాడు.
తిరుగులేని కింగ్
కాగా ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటి వరకు 252 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లి 8004 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది శతకాలతో పాటు.. 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా 705 ఫోర్లు, 272 సిక్సర్లు ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో ఉన్నాయి. రైటార్మ్ మీడియం పేసర్ అయిన కోహ్లి ఐపీఎల్‌లో నాలుగు వికెట్లు కూడా తీయడం విశేషం.
మూడేళ్ల షెడ్యూల్ ఇదే
ఇదిలా ఉంటే.. గతేడాది ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ.. ఫైనల్లో మాత్రం అడుగుపెట్టలేకపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లోనే ఇంటిబాట పట్టింది. ఇక బీసీసీఐ ఇప్పటికే మూడేళ్ల ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2025.. మార్చి 14- మే 25 వరకు.. ఐపీఎల్-2026.. మార్చి 15- మే 31 వరకు.. ఐపీఎల్- 2027.. మార్చి 14- మే 30 వరకు నిర్వహించనున్నారు.
చదవండి: 'డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'.. భజ్జీ పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment