ఐపీఎల్ వేలం-2024 వేలంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తెలివిగా వ్యవహరించాయని సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అన్నాడు. అదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మాత్రం ఆస్ట్రేలియా క్రికెటర్ల కోసం భారీ మొత్తం వెచ్చించడం సరికాదని అభిప్రాయపడ్డాడు.
ఈసారి వేలంలో ఫాస్ట్ బౌలర్లకు డిమాండ్ ఉన్న వాస్తవమే అయినా.. మరీ ఈ స్థాయిలో రూ. 20 కోట్లకు పైగా ఖర్చుచేస్తారని ఊహించలేదన్నాడు. కాగా దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఆక్షన్‌లో ఆసీస్ పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ రికార్డు స్థాయి ధర పలికిన విషయం తెలిసిందే.
కమిన్స్‌ను సన్‌రైజర్స్ రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేయగా.. స్టార్క్ కోసం కేకేఆర్ ఏకంగా రూ. 24.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే వీరిద్దరు అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా నిలిచారు. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఏబీ డివిలియర్స్‌కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది.
ఇందుకు స్పందిస్తూ.. ‘‘ఈసారి వేలంలో కొన్ని ఫ్రాంఛైజీలు స్మార్ట్‌గా వ్యవహరించాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ భావోద్వేగాలకు తావులేకుండా తెలివిగా కొనుగోళ్లు చేశాయి.
నిజానికి కమిన్స్, స్టార్క్ అద్భుతమైన ఆటగాళ్లే! అయితే, వాళ్ల కోసం అంత భారీ మొత్తం వెచ్చించాలా? అంటే అవసరం లేదనే చెప్పవచ్చు. ఫాస్ట్ బౌలర్లకు ఈసారి వేలంలో డిమాండ్ ఉన్న మాట నిజమే! అందుకే ధరలు అమాంతం పెరిగిపోయాయి.
అయితే, ముందుగా చెప్పినట్లు ముంబై ఇండియన్స్ తెలివిగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. నువాన్ తుషార, దిల్షాన్ మధుషాంక అద్భుతమైన క్రికెటర్లు. ఇక మహ్మద్ నబీ, శ్రేయస్ గోపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి ధరకే వాళ్లిద్దరు ముంబైకి లభించారు.
ముఖ్యంగా.. కొయెట్జీ, మధుషాంక, తుషారలను కలిపి 15 కోట్ల రూపాయలకే సొంతం చేసుకోవడం నాకు నచ్చింది’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా పేస్‌త్రయం గెరాల్డ్ కొయెట్జీని రూ. 5 కోట్లు, దిల్షాన్ మధుషాంకను రూ. 4.5 కోట్లు, నువాన్ తుషారను రూ. 4.8 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.
ఇక నబీ కోసం రూ. 1.5 కోట్లు, గోపాల్ కోసం రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. వీరితో పాటు నామన్ ధిర్‌ను రూ. 20 లక్షలు, అన్షూల్ కాంబోజ్‌ను రూ. 20 లక్షలు, శైవిక్ శర్మను రూ. 20 లక్షలకు ఐపీఎల్-2024 వేలంలో ముంబై కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment