మళ్లీ టోర్నీ నిర్వహించేందుకు ఆఫ్రికా క్రికెట్ సంఘం ప్రయత్నాలు
బెనోనీ (దక్షిణాఫ్రికా): సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఆఫ్రో–ఆసియా కప్ నిర్వహించే దిశగా చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు రెండుసార్లు జరిగిన ఈ కప్‌ను పునరుద్ధరించాలని ఆఫిక్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీతో)తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
2005లో తొలిసారి దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఆఫ్రో ఆసియా కప్ ‘డ్రా’గా ముగియగా... 2007లో భారత్ వేదికగా జరిగిన టోర్నీలో ఆసియా జట్టు విజేతగా నిలిచింది. షెడ్యూల్ ప్రకారం 2009లో కెన్యా వేదికగా మూడో ఎడిషన్ జరగాల్సి ఉన్నా అది సాధ్యపడలేదు.
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ దీనిపై చర్చ జరుగుతోంది. ‘ఆఫ్రో–ఆసియా కప్ ద్వారా కేవలం ఆటే కాదు... రెండు సంఘాలకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’ అని ఏసీఏ తాత్కాలిక చైర్మన్ తవెంగ్వా ముకులాని అన్నాడు. జింబాబ్వే క్రికెట్ సంఘం అధ్యక్షుడిగానూ పని చేస్తున్న తవెంగ్వా దీని కోసం చర్చలు జరుగుతున్నాయని వెల్లడించాడు.
‘ఆసియా క్రికెట్ కౌన్సిల్‌తో ఈ కప్ గురించి చర్చ జరుగుతుంది. ఆఫ్రికా వాసులంతా ఈ టోర్నీని తిరిగి తీసుకు రావాలని కోరుకుంటున్నారు’ అని తవెంగ్వా పేర్కొన్నాడు.
2005లో జరిగిన ఆఫ్రో–ఆసియా కప్‌లో ఆసియా జట్టుకు అప్పటి పాకిస్తాన్ సారథి ఇంజమాముల్ హక్ సారథిగా వ్యవహరించగా... భారత్ నుంచి రాహుల్ ద్రవిడ్, ఆశిష్ నెహ్రా, అనిల్ కుంబ్లే పాల్గొన్నారు.
ఇక 2007 లో జరిగిన టోర్నీలో భారత్ నుంచి ధోనీ, సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహా్వగ్, సచిన్ టెండూల్కర్ పాల్గొనగా... పాక్ జట్టు నుంచి మొహమ్మద్ యూసుఫ్, షోయబ్ అక్తర్, మొహమ్మద్ ఆసిఫ్ ప్రాతినిధ్యం వహించారు.
ఈసారి ఆఫ్రో–ఆసియా కప్‌ను ఐపీఎల్ తరహాలో నిర్వహించాలని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎక్కడ నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి, ఎలాంటి పద్ధతిలో ముందుకు వెళ్లాలి అనే దశ వరకు చర్చలు జరగనట్లు సమాచారం. కాగా... సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లే ఆడటం లేదు. అలాంటిది ఇప్పుడు ఇరు దేశాల ఆటగాళ్లు కలిసి ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అంటే అది అంత సులభం మాత్రం కాదు.
Comments
Please login to add a commentAdd a comment