విరాట్ కోహ్లి- బ్రెండన్ మెకల్లమ్ (PC: BCCI/ECB)
'Respect His Prowess & Competitiveness': టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ ఆటంటే తనకెంతో గౌరవమని.. అతడు భాగంగా ఉన్న జట్టుతో పోటీపడటాన్ని తాను ఆస్వాదించేవాడినని గుర్తు చేసుకున్నాడు.
అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాలు కోహ్లి సొంతమన్న మెకల్లమ్.. ప్రత్యర్థి జట్టుతో అతడు పోటీపడే తీరు మజా అందిస్తుందని పేర్కొన్నాడు. ఏదేమైనా మూడో టెస్టుతో కోహ్లి రీ ఎంట్రీ ఇస్తే అతడిని ఎదుర్కొనేందుకు తమ బౌలర్లు సిద్ధంగా ఉన్నారని మెకల్లమ్ చెప్పుకొచ్చాడు.
కాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో కలిసి.. ‘బజ్‌బాల్’ పేరిట సంప్రదాయ క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. అతడి మార్గదర్శనంలో టెస్టుల్లోనూ దూకుడు ప్రదర్శిస్తూ ఇంగ్లండ్ విజయవంతంగా ముందుకు సాగుతుండటం విశేషం.
ఈ క్రమంలో భారత్ వేదికగా టీమిండియాతో తొలి టెస్టులో గెలుపొందిన ఇంగ్లండ్.. రెండో మ్యాచ్‌లో మాత్రం భారీ తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ రెండు టెస్టులకు భారత మాజీ సారథి విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల దృష్ట్యా దూరమయ్యాడు.
అందుకే కోహ్లి దూరం
గర్భవతిగా ఉన్న భార్య అనుష్క శర్మ కోసం అతడు సమయం కేటాయించాడని కోహ్లి స్నేహితుడు ఏబీ డివిలియర్స్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానున్న మూడో టెస్టుకు కోహ్లి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కోహ్లి పోటీతత్వం అంటే నాకెంతో గౌరవం
ఈ నేపథ్యంలో బ్రెండన్ మెకల్లమ్ టాక్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘గొప్ప క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఒకడు. అతడి ఆట, పోటీతత్వం అంటే నాకెంతో గౌరవం. తనతో మ్యాచ్‌లు ఆడటాన్ని నేను ఆస్వాదించేవాడిని.
విజయవంతమైన ఆటగాడితో పోటీ పడటం అంటే.. మనం కూడా ఎంతో కొంత నేర్చుకునే వీలు ఉంటుంది కదా!’’ అంటూ కోహ్లిని కొనియాడాడు. మూడో టెస్టు నేపథ్యంలో కోహ్లి తిరిగి వస్తే.. అతడిని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై దృష్టి సారించామని మెకల్లమ్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు.
కాగా కోహ్లి రీఎంట్రీపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయం గురించి రాహుల్ ద్రవిడ్‌కు ప్రశ్న ఎదురుకాగా.. సెలక్టర్లకే కోహ్లి అందుబాటులో ఉండే విషయం గురించి అవగాహన ఉంటుందని తెలిపాడు. అతడితో వాళ్లు టచ్‌లో ఉన్నారని.. జట్టు ప్రకటన నాటికి క్లారిటీ వస్తుందంటూ మాట దాటేశాడు.
Comments
Please login to add a commentAdd a comment