Heath Streak: జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ మరణించాడంటూ సహచర ఆటగాడు హెన్రీ ఒలంగ చేసిన ట్వీట్ గందరగోళానికి కారణమైంది. క్యాన్సర్‌తో పోరాడుతూ స్ట్రీక్ చనిపోయాడని ఒలంగ సంతాపం ప్రకటించాడు. అయితే, తాజాగా అతడు బతికే ఉన్నాడంటూ మరో ట్వీట్‌తో ముందుకు వచ్చాడు. తప్పుడు వార్త ప్రచారానికి కారణమై అభిమానుల చేత చివాట్లు తింటున్నాడు. ఇదిలా ఉంటే.. కాన్సర్‌తో పోరాడుతున్న హెన్రీ స్ట్రీక్ రికార్డుల గురించి తెలుసుకుందామా?!
13 ఏళ్ల ప్రయాణం
1993- 2005 మధ్య పదమూడేళ్ల పాటు జింబాబ్వే తరఫున హీత్ స్ట్రీక్ అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. తన కెరీర్‌లో మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 254 మ్యాచ్‌లు ఆడిన ఈ పేస్ ఆల్‌రౌండర్.. వీటిలో 89 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. టెస్టుల్లో, వన్డేల్లో కలిపి 455 వికెట్లు కూల్చి నేటికీ జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌గా తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు.
లెజెండరీ ఆల్‌రౌండర్
అంతేకాదు.. 100 వికెట్ల క్లబ్‌లో చేరిన ఏకైక జింబాబ్వేయన్ కూడా హీత్ స్ట్రీక్. బౌలర్‌గానే గాకుండా బ్యాటర్‌గానూ అదరగొట్టాడు ఈ పేస్ ఆల్‌రౌండర్. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసి 4000 పరుగులు సాధించాడు.
PC: Twitter
అరంగేట్రంలో నో వికెట్.. మరుసటి మ్యాచ్‌లో మాత్రం
1993లో పాకిస్తాన్‌తో టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన హీత్ స్ట్రీక్.. తొలి మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, రావల్పిండిలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. మొత్తంగా.. టెస్టుల్లో 1990.. వన్డేల్లో 2943 రన్స్ సాధించాడు. హరారే వేదికగా వెస్టిండీస్ మీద టెస్టు మ్యాచ్‌లో ఓ సెంచరీ(127- నాటౌట్) కూడా సాధించాడు.
టీమిండియాను ఓడించి..
హీత్ స్ట్రీక్ సారథ్యంలోని జింబాబ్వే జట్టు 2001లో టీమిండియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. ఇక వరల్డ్‌కప్-2003లోనూ జట్టును ముందుండి నడిపించాడు. స్ట్రీక్ కెప్టెన్సీలో నాడు జింబాబ్వే సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది.
PC: Twitter
కోచ్‌గా ఐపీఎల్‌లోనూ..
2005లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హీత్ స్ట్రీక్.. కోచ్‌గా కొత్త అవతారమెత్తాడు. జింబాబ్వేతో పాటు స్కాట్లాండ్, బంగ్లాదేశ్ జట్లకు మార్గదర్శనం చేశాడు. ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కూడా కోచ్‌గా పనిచేశాడు హీత్ స్ట్రీక్.
అంతకుముందు.. వార్విక్‌షైర్ కెప్టెన్‌గా 2006లో రెండేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్న స్ట్రీక్.. వ్యక్తిగత కారణాల వల్ల పూర్తికాలం పాటు సారథిగా సేవలు అందించలేకపోయాడు. దురదృష్టవశాత్తూ క్యాన్సర్ బారిన పడ్డాడు హీత్ స్ట్రీక్.
చదవండి: వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్..
Comments
Please login to add a commentAdd a comment