టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయంపై కెప్టెన్ రోహిత్ శర్మ కీలక అప్‌డేట్ అందించాడు. సర్జరీ అయిన మోకాలికే బంతి బలంగా తాకిందని.. ముందు జాగ్రత్త చర్యగానే పంత్‌ను డ్రెస్సింగ్‌రూమ్‌కి పంపినట్లు తెలిపాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందంటూ అభిమానులకు శుభవార్త అందించాడు.
అప్పుడు ప్రాణాలతో బయటపడినా
భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 2022లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడినా తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవించాడు. అనేక సర్జరీల అనంతరం కోలుకున్న ఈ ఉత్తరాఖండ్ క్రికెటర్.. దాదాపు ఏడాదిన్నర తర్వాత పునరాగమనం చేశాడు. ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
అనంతరం టీ20 ప్రపంచకప్-2024లో పాల్గొని టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగా టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన పంత్.. శతకంతో అదరగొట్టాడు. ఈ క్రమంలో స్వదేశంలో తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడుతున్న భారత జట్టుకు ఎంపికయ్యాడు.
‘టాప్’ స్కోరర్‌గా
ఇక కివీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరులో తొలి టెస్టు జరుగుతోంది. బుధవారమే ఆరంభం కావాల్సి ఉండగా.. భారీ వర్షం వల్ల మొదటి రోజు ఆట సాధ్యం కాలేదు. ఈ క్రమంలో గురువారం వాన పడకపోవడంతో ఆటను మొదలుపెట్టారు. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి.. 46 పరుగులకే కుప్పకూలింది.
భారత్ తొలి ఇన్నింగ్‌స్లో రిషభ్ పంత్ 20 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆట ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. అయితే, కివీస్ మొదిటి ఇన్నింగ్స్ సమయంలో పంత్‌కు గాయమైంది. 37వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన బంతిని కివీస్ బ్యాటర్ డెవాన్ కాన్వే షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
దీంతో బాల్ ఆఫ్ స్టంప్ మీదుగా వచ్చి పంత్ మెకాలికి బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడుతూ మైదానాన్ని వీడాడు. అతడి స్థానాన్ని ధ్రువ్ జురెల్ భర్తీ చేశాడు. నిజానికి.. ఈ మ్యాచ్‌కు పంత్ మళ్లీ అందుబాటులోకి రావడం అత్యంత ముఖ్యం. బ్యాటర్‌గా, కీపర్‌గా అతడి సేవలు జట్టుకు అవసరం.
మోకాలు కాస్త వాపు వచ్చింది
దీంతో అతడు గాయం వల్ల దూరమైతే పరిస్థితి ఏమిటన్న అభిమానుల ఆందోళన నేపథ్యంలో రోహిత్ శర్మ స్పందించాడు. గురువారం ఆట అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దురదృష్టవశాత్తూ సరిగ్గా మోకాలికే బంతి తగలింది.
అదే కాలికి గతంలో సర్జరీ జరిగింది. అందుకే.. మోకాలు కాస్త వాపు వచ్చింది. కండరాలు కూడా పట్టేశాయి. అందుకే మేము రిస్క్ తీసుకోదలచుకోలేదు. రిషభ్ కూడా మాకు ఇదే చెప్పాడు. అందుకే ముందుజాగ్రత్త చర్యగా అతడిని వెనక్కి పంపించాం.
సర్జరీ జరిగిన కాలుకే గాయం కావడంతో ఈ నిర్ణం తీసుకున్నాం. అతడు తొందరగానే కోలుకుంటాడని ఆశిస్తున్నాం. రేపు(శుక్రవారం) తనని మనం మైదానంలో చూస్తామనే అనుకుంటున్నాం’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
చదవండి: Ind vs NZ: తప్పు నాదే.. పిచ్‌ను సరిగా అంచనా వేయలేకపోయా: రోహిత్
Comments
Please login to add a commentAdd a comment