టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గారాల పట్టి సమైరా శర్మ ఐదో పుట్టినరోజు నేడు(డిసెంబరు 30). ఈ సందర్భంగా హిట్‌మ్యాన్ తన చిన్నారి కూతురు కోసం తానూ చిన్నపిల్లాడిలా మారిపోయాడు. తన ముద్దుల కుమార్తెతో కలిసి టాయ్ ట్రైన్‌లో విహరిస్తూ సందడి చేశాడు.
ఆమెతో కలిసి అల్లరి చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఆ తర్వాత.. కుటుంబ సభ్యుల సమక్షంలో సమైరా బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేశాడు. భార్య రితికా సజ్దేతో కలిసి సమైరాతో కేక్ కట్ చేయించాడు.
‘సమైరా పోనివిల్లే థీమ్’ పేరిట నిర్వహించిన ఈ పార్టీకి సంబంధించిన వీడియోను రితిక ఇన్‌స్టాలో షేర్ చేసింది. రోహిత్ శర్మ సైతం.. ‘‘నీ ఎదుగులను చూస్తూ మురిసిపోవడమే మా జీవితానికి సార్ధకత’’ అంటూ ఉద్వేగపూరిత శుభాకాంక్షలు తెలియజేశాడు.
ఈ నేపథ్యంలో సమైరాకు హిట్‌మ్యాన్ అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రితికా సజ్దేతో ఆరేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన రోహిత్ శర్మ డిసెంబరు 13, 2015లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు డిసెంబరు 30, 2018లో కుమార్తె జన్మించగా ఆమెకు సమైరాగా నామకరణం చేశారు.
వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఓటమి తర్వాత..
రోహిత్ శర్మ సారథ్యంలో.. సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్-2023 టోర్నీలో లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి టీమిండియా అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లోనూ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.
అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని జయించలేక బోల్తా పడ్డ రోహిత్ సేన.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఓటమిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమైన భారత ఆటగాళ్లు భారమైన హృదయాలతో మైదానాన్ని వీడారు.
ఇక ఈ మ్యాచ్ తర్వాత దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా మళ్లీ జట్టుతో చేరాడు. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా సత్తా చాటాలని భావించాడు. కానీ అతడి కల నెరవేరలేదు.
సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ బాక్సింగ్ డే టెస్టును మూడు రోజుల్లోనే ముగించిన ప్రొటిస్.. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించింది.
ఈ మ్యాచ్‌లో రోహిత్ మొత్తంగా కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఆటగాడిగానూ విఫలమయ్యాడు. ఇక సౌతాఫ్రికా- టీమిండియా మధ్య రెండో టెస్టు జనవరి 3 నుంచి ఆరంభం కానుంది.
చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. సౌతాఫ్రికాకు మరో ఊహించని షాక్
Comments
Please login to add a commentAdd a comment