WC 2027: రోహిత్‌ శర్మ ప్లానింగ్‌ ఇదే!.. అతడి మార్గదర్శనంలో సన్నద్ధం! | Rohit Sharma Might Exit After This Now Planning To participate in ODI WC at 40 all the | Sakshi
Sakshi News home page

WC 2027: రోహిత్‌ శర్మ ప్లానింగ్‌ ఇదే!.. అతడి మార్గదర్శనంలో సన్నద్ధం!

Published Thu, Mar 13 2025 3:34 PM | Last Updated on Thu, Mar 13 2025 4:50 PM

Rohit Sharma Might Exit After This Now Planning To participate in ODI WC at 40 all the

‘ఇంకో విషయం చెప్పాలి.. ఈ ఫార్మాట్‌ నుంచి నేను రిటైర్‌ కావడం లేదు. ఇకపై వదంతులు ప్రచారం చేయకుండా ఉండాలనే ఈ మాట చెబుతున్నా’’... ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) చేసిన వ్యాఖ్యలు ఇవి. తాను భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని.. జీవిత ప్రయాణంలో ఎదురైన వాటినే తాను స్వీకరిస్తానని స్పష్టం చేశాడు.

ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఆట మీదే ఉందని.. 2027 వన్డే వరల్డ్‌కప్‌ నాటికి కొనసాగుతానా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేనని రోహిత్‌ శర్మ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. రిటైర్మెంట్‌ గురించి ఇప్పుడు తాను ఎలాంటి కామెంట్లూ చేయలేనని పేర్కొన్నాడు.

ఊహాగానాలు ఆగటం లేదు
క్రికెట్‌ ఆడటాన్ని ఇప్పటికీ పూర్తిగా ఆస్వాదిస్తున్నానని.. జట్టుతో సమయం గడపడం తనలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోందని.. సహచర ఆటగాళ్లు కూడా తనతో ఉండేందుకు ఇష్టపడుతున్నారని హిట్‌మ్యాన్‌ తెలిపాడు. ఇంత చెప్పినప్పటికీ రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ గురించి ఊహాగానాలు ఆగటం లేదు. అతడి భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

వన్డేల్లో కొనసాగినా.. టెస్టులకు మాత్రం రోహిత్‌ దూరం కానున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక యాభై ఓవర్ల ఫార్మాట్‌లో మరో రెండేళ్లకు అంటే.. 2027 తర్వాత రోహిత్‌ పక్కకు తప్పుకోవడం లాంఛనమేననే వార్తలు వస్తున్నాయి. కాగా రోహిత్‌ వచ్చే నెలలో 38వ వసంతంలో అడుగుపెడతాడు.

నలభై ఏళ్ల వయసులో ఎలా?
వన్డే వరల్డ్‌కప్‌-2027(ICC ODI World Cup 2027) నాటికి అతడికి నలభై ఏళ్లు వస్తాయి. ఇక సౌతాఫ్రికా- జింబాబ్వే- నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా ఐసీసీ ఈవెంట్‌ కంటే ముందు టీమిండియా దాదాపు 27 వన్డేలు ఆడనుంది. సమయాన్ని బట్టి ఇందుకు అదనంగా మరికొన్ని మ్యాచ్‌లు కూడా షెడ్యూల్‌ కావచ్చు. అయితే, వరల్డ్‌కప్‌ నాటికి రోహిత్‌ ఫిట్‌గా ఉండేందుకు ఇప్పటి నుంచే సన్నాహాకాలు మొదలుపెట్టాడని క్రిక్‌బజ్‌ నివేదిక పేర్కొంది.

అతడి మార్గదర్శనంలో సన్నద్ధం!
టీమిండియా కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ మార్గదర్శనంలో రోహిత్‌ తన ప్రయాణాన్ని కొనసాగించేందుకు వీలుగా ప్రత్యేక షెడ్యూల్‌ రూపొందించుకున్నట్లు సమాచారం. కాగా ఇంటెలిజింట్‌, వినూత్న టెక్నిక్‌లకు నాయర్‌ పెట్టింది పేరు. దినేశ్‌ కార్తిక్‌, కేఎల్‌ రాహుల్‌ తదితర స్టార్‌ ప్లేయర్లు నాయర్‌ విధానాలు పాటించి కష్టకాలం నుంచి బయటపడ్డారు.

ఇప్పుడు రోహిత్‌ శర్మ కూడా అదే బాటలో పయనించనున్నట్లు తెలుస్తోంది. ఇక హిట్‌మ్యాన్‌ ప్రస్తుతం ఐపీఎల్‌-2025కి సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో అతడు ముంబై ఇండియన్స్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. 

కాగా ముంబైకి ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ అందించి.. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా రోహిత్‌ తన పేరిట చెక్కుచెదరని రికార్డును లిఖించుకున్నాడు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్‌.. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement