Reason Behind Rohit Sharma Replaced Kohli As ODI Captain - Sakshi
Sakshi News home page

ODI Captaincy- Virat Kohli: అందుకే కోహ్లిపై వేటు వేశారు!.. మరీ ఇంత అవమానకరంగా.. ఇక టెస్టు కెప్టెన్సీకి కూడా..

Published Thu, Dec 9 2021 10:12 AM | Last Updated on Thu, Dec 9 2021 11:21 AM

Rohit Sharma Replace Virat Kohli As ODI Captain What Are The Reasons - Sakshi

Reason Behind Rohit Sharma As ODI Captain: ఊహాగానాలు నిజమయ్యాయి.. దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.. వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లిని తప్పించి రోహిత్‌ శర్మకు పగ్గాలు అప్పగించింది.. విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకున్న కోహ్లిపై ఇలా వేటు వేయడాన్ని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు క్రికెటేతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి. 

కోహ్లి అద్భుత రికార్డు.. అయినా
95 వన్డేల్లో 75 విజయాలు, 27 పరాజయాలు... ఓవరాల్‌గా కనీసం 50కి పైగా వన్డేల్లో నాయకత్వం వహించిన కెప్టెన్ల జాబితా చూస్తే ఇద్దరికి మాత్రమే ఇంతకంటే మెరుగైన గెలుపు/ఓటముల నిష్పత్తి (లాయిడ్, పాంటింగ్‌) ఉంది. ఇక తన కెప్టెన్సీలో అత్యంత అసాధారణమైన 72.65 సగటుతో కోహ్లి 5,449 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 27 అర్ధసెంచరీలు ఉన్నాయి.

ఎలా చూసినా ఇది అద్భుత రికార్డు. అయినా సరే ఇవేవీ కోహ్లిని వన్డే కెప్టెన్సీ కోల్పోకుండా రక్షించలేకపోయాయి. క్రికెట్‌ పరమైన కారణంగా చూస్తే రెండు ఐసీసీ టోర్నీల్లో (2017 చాంపియన్స్‌ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్‌కప్‌)లలో అతను విఫలమయ్యాడనేది ఒక వాదన. ఒకదాంట్లో ఫైనల్‌ చేరిన జట్టు, మరో టోర్నీలో సెమీస్‌ వరకు వెళ్లింది. అదే కారణమైతే 2019 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాతే అతని నాయకత్వంపై చర్చ జరిగేది.

అందుకే వేటు వేశారా?
ఇంత కాలం కెప్టెన్సీ నుంచి కాపాడుకున్న అతను ఇప్పుడు కోల్పోవడం మాత్రం ఆశ్చర్యకరం. అయితే బీసీసీఐ వర్గాల అంతర్గత సమాచారం ప్రకారం చూస్తే క్రికెటేతర కారణాలే అతనిపై వేటుకు కారణమయ్యాయి. కోహ్లిని తప్పించాలనే ఆలోచన బోర్డులో ఎప్పటి నుంచో సాగుతోంది. తగిన సమయం చూసి వారు దీనిని అమలు చేశారు. ముఖ్యంగా బయటకు కనిపించని ‘గంగూలీతో విభేదాలు’ వంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి.

రవిశాస్త్రి అండగా అతను తానే అన్నీ శాసించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఒకదశలో వైస్‌ కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి భవిష్యత్తు కోసం రాహుల్‌ లేదా పంత్‌లలో ఒకరికి వైస్‌ కెప్టెన్సీ ఇవ్వాలంటూ అతను సూచించడం బోర్డులో అందరికీ ఆగ్రహం కలిగించింది. టి20 నుంచి తప్పుకోవాలనేది కూడా కోహ్లి సొంత నిర్ణయం కాదని, బోర్డు అతనితో చెప్పించిందని కూడా సమాచారం.

ఆ ఫార్మాట్‌లో కూడా నాయకత్వానికి గ్యారంటీ లేదు!
ఈ రెండు ఫార్మాట్‌లలో రోహిత్‌ రూపంలో సరైన ప్రత్యామ్నాయం ఉండటంతో సెలక్టర్లకు సమస్య లేకపోయింది. టెస్టుల్లో కొన్నాళ్ల క్రితం వరకు కూడా రోహిత్‌ రెగ్యులర్‌ సభ్యుడు కాదు. తన స్థానం పదిలం చేసుకునే ప్రయత్నంలోనే అతను ఉన్నాడు. ఇప్పుడు ఆ దశను అధిగమించాడు కాబట్టి వైస్‌ కెప్టెన్సీ అప్పగించేశారు. అంటే టెస్టుల్లో కూడా ప్రత్యామ్నాయం ఉంది.

కాబట్టి ఇకపై కోహ్లికి ఆ ఫార్మాట్‌లో కూడా నాయకత్వానికి గ్యారంటీ లేదు! అయితే మరో కోణంలో చూస్తే ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన కోహ్లి ఈ నాయకత్వ ఒత్తిడి నుంచి తప్పుకొని తన ఆటపై మరింత దృష్టి పెడితే  మరిన్ని అద్భుత ఇన్నింగ్స్‌ అతడి నుంచి రావచ్చు. ఏదేమైనా ఇలా అవమానకర రీతిలో కోహ్లికి ఉద్వాసన పలకడం సరికాదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: India Tour Of South Africa: భారత​ టెస్ట్‌ జట్టు ప్రకటన.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement