టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ గనుక వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయమని పేర్కొన్నాడు. ఫ్రాంఛైజీలన్నీ పంత్ వైపు చూస్తున్నాయన్న ఆకాశ్ చోప్రా.. అతడు ఈసారి రూ. 25- 30 కోట్ల ధర పలికినా ఆశ్చర్యం లేదన్నాడు.
ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయం.. కారణాలు ఇవే
కాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి సమయం సమీపిస్తోంది. నవంబరు ఆఖరి వారంలో ఆక్షన్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను అక్టోబరు 31లోగా సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. రిషభ్ పంత్ వేలంలోకి వస్తే ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయమంటూ.. అందుకు గల కారణాలను కూడా విశ్లేషించాడు.
‘‘రిషభ్ పంత్ వేలంలోకి వస్తాడనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అతడు వికెట్ కీపర్ బ్యాటర్. అయితే, చాలా మంది అతడి టీ20 గణాంకాలు అంత బాగా లేవని అంటూ ఉంటారు. ఐపీఎల్‌లో ఇంత వరకు భారీ స్థాయిలో పరుగులు రాబట్టలేదన్నది వాస్తవమే.
అయినప్పటికీ అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయం. ఆర్సీబీకి కీపర్ కావాలి.. బ్యాటర్ కావాలి.. బహుశా కెప్టెన్ కూడా కావాలి. ఇక పంజాబ్‌కి కూడా వికెట్ కీపర్ లేడు. ఢిల్లీకీ పంత్ కావాలి.
వాళ్లకూ వికెట్ కీపర్ లేడు
కేకేఆర్‌కు కూడా అతడి అవసరం ఉంది. ఇక సీఎస్‌కే కూడా పంత్ లాంటి వికెట్ కీపర్‌ను కోరుకోవడంలో సందేహం లేదు. ఒకవేళ ఇషాన్ కిషన్ జట్టులో లేకుంటే.. ముంబైకీ పంత్ కావాలి. నికోలస్ పూరన్ ఉన్నా... లక్నో కూడా పంత్‌పై ఆసక్తి చూపవచ్చు.
గుజరాత్ జట్టు పరిస్థితి కూడా ఇదే. వాళ్లకూ వికెట్ కీపర్ లేడు. కాబట్టి రిషభ్ పంత్ వేలంలోకి వస్తే రూ. 25- 30 కోట్ల మధ్య అమ్ముడుపోతాడు’’ అని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాగా ఘోర రోడ్డు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్.. దాదాపు ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.
ఈ ఏడాది రీ ఎంట్రీ
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన పంత్.. జట్టును ఆరోస్థానంలో నిలిపాడు. సారథిగా ఆకట్టుకోలేకపోయినా.. 446 పరుగులతో బ్యాటర్‌గా రాణించాడు. వికెట్ కీపర్‌గానూ తన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేశాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment