ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్‌కు అడుగుదూరంలో ఉంది సౌతాఫ్రికా. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి.. టైటిల్ పోరుకు అర్హత సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రిస్క్ తీసుకునేందుకు కూడా ప్రొటిస్ బోర్డు వెనుకాడటం లేదు.
గాయం బారినపడ్డ కేశవ్ మహరాజ్, వియాన్ ముల్దర్‌లను కూడా టెస్టు జట్టుకు ఎంపిక చేయడం ఇందుకు నిదర్శనం. కాగా పాకిస్తాన్‌తో డిసెంబరు 26 నుంచి సౌతాఫ్రికా టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రొటిస్ బోర్డు బుధవారం తమ జట్టును ప్రకటించింది.
తొలి పిలుపు
పదహారు మంది సభ్యులున్న ఈ టీమ్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు చోటిచ్చింది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కార్బిన్ బాష్‌కు తొలిసారి పిలుపునిచ్చింది. అదే విధంగా.. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న స్పిన్నర్ కేశవ్ మహరాజ్, వేలి నొప్పి నుంచి కోలుకుంటున్న ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్‌ను కూడా ఈ జట్టులో చేర్చింది.
కాగా తొలి వన్డే సందర్భంగా గాయపడ్డ కేశవ్ మహరాజ్ కోలుకోని పక్షంలో.. అతడి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సెనూరన్ ముత్తుస్వామిని జట్టుకు ఎంపిక చేయనున్నారు. అదే విధంగా సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ముల్దర్ ఫిట్‌నెస్ సాధిస్తే.. బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్‌కు ఉద్వాసన పలుకనున్నారు.
క్వెనా మఫాకా కూడా
ఇక తెంబా సారథ్యంలో పాక్‌తో టెస్టులు ఆడనున్న సౌతాఫ్రికా జట్టులో స్థానం సంపాదించిన బాష్.. ఇప్పటి వరకు 34 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 40.46 సగటుతో పరుగులు రాబట్టడంతో పాటు.. 72 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. మరో పేసర్, పద్దెమినిదేళ్ల క్వెనా మఫాకా కూడా తొలిసారి టెస్టు జట్టులోకి వచ్చాడు.
అయితే, పేస్ సూపర్‌స్టార్లు లుంగి ఎంగిడి, గెరాల్డ్ కొయెట్జిలతో పాటు నండ్రీ బర్గర్, లిజాడ్ విలియమ్స్ తదితరులు సెలక్షన్‌కు అందుబాటులో లేరు. మరోవైపు.. కగిసో రబడ, మార్కో జాన్సెన్ పాక్‌తో తొలి వన్డే ఆడినా.. ఆ తర్వాత నుంచి విశ్రాంతి తీసుకోనున్నారు.
టెస్టుల నేపథ్యంలో బోర్డు వారికి రెస్ట్ ఇచ్చింది. కాగా పాక్‌తో ఒక్క టెస్టులో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో సౌతాఫ్రికా ముందు వరుసలో ఉంటుంది. ఇక పాక్‌తో సౌతాఫ్రికా టెస్టులకు సెంచూరియన్, కేప్‌టౌన్ వేదికలు.
పాకిస్తాన్‌తో టెస్టులకు సౌతాఫ్రికా జట్టు
తెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్, టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్దర్, సెనురన్ ముత్తుస్వామి, డేన్ ప్యాటర్సన్, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెయిన్ (వికెట్ కీపర్).
Comments
Please login to add a commentAdd a comment