ఆస్ట్రేలియాతో మూడో టెస్టు డ్రా కావడం టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. ఈ మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసిపోవడం వల్ల ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ రేసులో రోహిత్ సేన నిలవగలిగింది. అయితే, మిగిలిన రెండు టెస్టుల్లో కచ్చితంగా గెలిస్తేనే భారత్‌కు మార్గం సుగమమవుతుంది.
మూడో స్థానంలోనే టీమిండియా
డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో తమ చివరి టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కనీసం నాలుగు గెలిస్తేనే భారత్‌కు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టే అవకాశం ఉండేది. ఈ క్రమంలో తొలి టెస్టులో భారీ తేడాతో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో మాత్రం ఘోరంగా ఓడిపోయింది.
అయితే, మూడో మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకుని కనీసం డ్రా చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన మూడో స్థానం నిలబెట్టుకోగలిగింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 114 పాయింట్లు ఉన్నాయి. ఇక విజయాల శాతం 55.88గా ఉంది.
మరోవైపు.. అగ్రస్థానంలో ఉన్న సౌతాఫ్రికాకు 76 పాయింట్లే ఉన్నా.. గెలుపు శాతం 63.33. ఇక రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఖాతాలో 106 పాయింట్లు ఉండగా.. విన్నింగ్ పర్సెంటేజ్ 58.89. కాగా సౌతాఫ్రికా తదుపరి సొంతగడ్డ మీద పాకిస్తాన్‌తో రెండు టెస్టులు ఆడనుంది.
ఇక ఆస్ట్రేలియా కూడా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ రెండు జట్లు తమ తదుపరి సిరీస్‌లలో సులువుగానే గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి... టీమిండియాకు పెద్ద సవాలే ముందుంది.
రోహిత్ సేన తప్పక గెలవాల్సిందే
ఈ సీజన్‌లో టీమిండియాకు మిగిలినవి రెండే టెస్టులు. ఆసీస్‌తో మెల్‌బోర్న్, సిడ్నీ టెస్టులో కచ్చితంగా రోహిత్ సేన గెలవాల్సిందే. తద్వారా ఆస్ట్రేలియాపై 3-1తో విజయం సాధిస్తే.. భారత్ విజయాల శాతం 60.52కు పెరుగుతుంది. మరోవైపు.. ఆసీస్ విన్నింగ్ పర్సెంటేజ్ 57 శాతానికి పడిపోతుంది. దీంతో టీమిండియాకు ఫైనల్ లైన్ క్లియర్ అవుతుంది.
లేని పక్షంలో.. ఒకవేళ ఈ సిరీస్ 2-2తో డ్రా అయితే.. రోహిత్ సేన గెలుపు శాతం 57.01 అవుతుంది. అదే గనుక జరిగితే ఆస్ట్రేలియాకు టైటిల్ పోరుకు అర్హత సాధించడం సులువవుతుంది. శ్రీలంక టూర్‌లో కంగారూలు 2-0తో గెలిస్తే నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది.
సౌతాఫ్రికాకు లైన్‌క్లియర్!
ఇక సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను గనుక 2-0తో క్లీన్‌స్వీప్ చేస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. కాబట్టి అప్పుడు రెండోస్థానం కోసం రేసు ప్రధానంగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్యే ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా అద్భుతం చేసి సౌతాఫ్రికాను నిలువరిస్తే అప్పుడు పరిస్థితి మరింత రసవత్తరంగా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment