Sachin- Anjali Love Story In telugu: తొలి చూపులోనే ప్రేమ.. ప్రణయంలో ఐదేళ్ల ప్రయాణం.. వయసులో ఐదేళ్ల వ్యత్యాసం... అతడు ఆమె కంటే చిన్నవాడు కావడం వల్లపెద్దల నుంచి నో అనే మాట వినాల్సి వస్తుందేమోనన్న భయం..
అతడు మొహమాటపడ్డాడు.. ఆమె బాధ్యతను తన భుజాల మీద వేసుకుంది.. మనసిచ్చిన వాడితో కలిసి జీవితాంతం నడవాలన్న కలను నెరవేర్చుకునేందుకు తనే ముందుడుగు వేసింది.. పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పింది..
వాళ్లు అర్థం చేసుకున్నారు.. ఆ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది.. ఆటలో రికార్డుల రారాజే అయినా.. ఇంట్లో ప్రతి చిన్న విషయానికి తనపై ఆధారపడే భర్త కోసం ఆమె తన కెరీర్‌ను త్యాగం చేసింది.. ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు.. ముచ్చటైన కుటుంబం.. అదే ఆమె ప్రపంచం.. నిజానికి ఆమె లేకుంటే అతడు లేడు.. తను క్రికెట్ దేవుడిగా ఎదగడంలో ఆమెది కూడా కీలక పాత్రే.. అలాంటి భార్యను పొందడం తన అదృష్టం అంటాడతడు..
నిజమే.. సంపన్న కుటుంబంలో పుట్టి.. ఏకైక సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెరిగి.. డాక్టర్ అయినప్పటికీ కుటుంబం కోసం బంగారం లాంటి కెరీర్‌ను పణంగా పెట్టిన ఆ మహిళ పేరు అంజలి. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సతీమణి. సచిన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా కపుల్ గోల్స్ సెట్ చేసిన అంజలి- సచిన్ ప్రేమకథ.
తొలి చూపులోనే ప్రేమ
17 ఏళ్ల వయసులో 1989లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు సచిన్ టెండుల్కర్. పాకిస్తాన్ పర్యటనలో టెస్టు సిరీస్‌లో భాగంగా అరంగేట్రం చేసిన అతడు తొలి మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు.. కానీ రెండో మ్యాచ్‌లో అర్ధ శతకంతో మెరిశాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ముగించుకుని జట్టుతో పాటు భారత్‌కు పయనమయ్యాడు.
స్వదేశానికి చేరుకుని స్వస్థలానికి పయనమయ్యే క్రమంలో ఎయిర్‌పోర్టులో తొలిసారి అంజలిని చూశాడు. తన తల్లిని తీసుకువెళ్లేందుకు అక్కడికి వచ్చిన అంజలి కూడా తొలి చూపులోనే ప్రేమలో పడింది.
ఆమె డాక్టర్
తర్వాత కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరూ మరోసారి కలుసుకున్నారు. స్నేహం పెరిగి.. ప్రేమగా మారింది. అప్పుడప్పుడే క్రికెటర్‌గా ఎదుగుతున్నాడు సచిన్.. మరోవైపు అంజలి మెడిసిన్ చదువుతోంది.. ప్రేమలో ఉన్నా సచిన్ ఆటను, అంజలి చదువును నిర్లక్ష్యం చేయకుండా కెరీర్‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చారు.
చదువులో చురుకైన అంజలికి క్రికెట్ గురించి పెద్దగా తెలియదు.. అయితే, ఎప్పుడైతే సచిన్‌ను ఇష్టపడటం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఆటపై కూడా ఆసక్తి పెంచుకుంది.. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మొదలుపెట్టారు.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
జర్నలిస్టు అని చెప్పు సరేనా!
అంజలిని తన తల్లిదండ్రులకు పరిచయం చేయాలనుకున్న సచిన్.. ఆమెను ఓ రోజు ఇంటికి ఆహ్వానించాడు. అయితే, ఇంట్లో వాళ్లందరికీ ముందే విషయం తెలిసిపోతే బాగుండదని భావించి తనను తాను జర్నలిస్టుగా పరిచయం చేసుకోమని అంజలికి చెప్పాడు.
నువ్వు ఎలా అంటే అలా! సరే అంది అంజలి. సల్వార్ కమీజ్‌లో డ్రెస్సప్ అయి సచిన్ ఇంటికి వెళ్లింది. కాబోయే అత్తామామలను పరిచయం చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య అనుబంధం మరింత పెరిగింది.
ఫోన్ బిల్స్ కట్టలేక
1990లలో మొబైల్ ఫోన్స్ ఉనికి పెద్దగా లేదు. కాబట్టి సచిన్‌తో మాట్లాడాలంటే అంజలి ఎంతో విశాలమైన కాలేజీ క్యాంపస్ దాటి టెలిఫోన్ బూత్‌కు వెళ్లి అక్కడ నుంచి కాల్ చేసేదట. అయితే, సచిన్ తరచూ విదేశీ టూర్లకు వెళ్తున్న కారణంగా బిల్ ఎక్కువగా వస్తుందని భావించి లెటర్స్ రాయడం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అంజలి స్వయంగా చెప్పింది.
1994లో నిశ్చితార్థం.. మరుసటి ఏడాది పెళ్లి
తమ ప్రేమ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పేందుకు సచిన్ మొహమాట పడటంతో అంజలినే స్వయంగా వారితో మాట్లాడి ఒప్పించింది. అలా సచిన్- అంజలిల నిశ్చితార్థం 1994లో న్యూజిలాండ్ టూర్‌లో ఉన్న సమయంలో జరిగింది.
ఆ మరుసటి ఏడాది మే 24న వీరి వివాహం జరిగింది. 1997లో తొలి సంతానంగా కుమార్తె సారా జన్మించగా, 1999లో కుమారుడు అర్జున్ జన్మించాడు. సారా మోడల్‌గా, అర్జున్ క్రికెటర్‌గా అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
కుటుంబం కోసం త్యాగం
పిడియాట్రిషియన్‌గా ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగం పొందిన అంజలి.. భార్యగా, డాక్టర్‌గా రెండు పడవల మీద ప్రయాణం చేయలేకపోయింది. సచిన్ తన కెరీర్‌లో బిజీ కావడంతో పిల్లల కోసం గృహిణిగా మారిపోయింది.
ఎవరినీ ఊహించుకోలేను
‘‘సచిన్ కాకుండా నా జీవితంలో మరో వ్యక్తికి చోటు లేదు. తనని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నేను తన గర్ల్‌ఫ్రెండ్‌గా ఉన్నప్పుడైనా.. భార్యగా మారిన తర్వాతైనా మా బంధంలో ఎలాంటి మార్పు లేదు. తను కాకుండా నా జీవితంలో వేరే వ్యక్తిని అసలు ఊహించుకోలేను.
తను ఆడే ప్రతి మ్యాచ్‌ను నేను తప్పకచూసేదాన్ని. స్టేడియానికి వెళ్లడం పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే ఇంట్లోనే టీవీలో తన బ్యాటింగ్ చూసేదాన్ని. మా ఇంట్లో ఇందుకోసమే ప్రత్యేకంగా ఓ టీవీ ఉంది. దాని పక్కనే గణేషుడి విగ్రహం కూడా! సచిన్ క్రీజులో ఉన్నంత సేపు అలా చూస్తూ ఉండిపోతా.
ఆ సమయంలో కనీసం తినడానికి కూడా అక్కడి నుంచి కదలను. కనీసం నీళ్లు కూడా ముట్టను. ఫోన్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకు ఆన్సర్ కూడా చేయను’’ అంటూ సచిన్‌తో పాటు తన ఆటను కూడా అంతే ప్రేమిస్తానని అంజలి ఒక సందర్భంలో చెప్పింది.
అంజలి గురించి ఆసక్తికర విశేషాలు
►గుజరాతీ కుటుంబంలో జన్మించిన అంజలి ముంబైలో పెరిగింది.
►అంజలి తండ్రి ఆనంద్ మెహతా గుజరాతీ పారిశ్రామికవేత్త. ఆమె తల్లి అన్నాబెల్ బ్రిటిష్ సంతతికి చెందినవారు. అప్నాలయ పేరుతో ఎన్జీవో స్థాపించారు.
►అంజలి తాతయ్య భూస్వామి. ఆమె కుటుంబానికి బ్రీచ్‌కాండీ ఏరియాలో అత్యంత విలాసమైన రెసిడెన్షియల్ బంగ్లాలు ఉన్నాయి.
►అంజలి కజిన్లలో చాలా మంది మెక్సికన్ మూలాలు ఉన్నవారు ఉన్నారు.
►అంజలి కుటుంబానికి నెహ్రూ- గాంధీ కుటుంబంతో సత్సంబంధాలు ఉండేవట.
చదవండి: #HBD Sachin: సచిన్ క్రికెట్‌కి దేవుడైతే.. ఆ భక్తుడు ప్రత్యక్షం కావాల్సిందే!
గతంలో ఎప్పుడూ చూడలేదు.. పర్పుల్ క్యాప్ పొందేందుకు అర్హుడు: కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment