గత సీజన్‌ను కరోనా ముంచేసింది. ఈ సీజన్‌నూ వెంటాడుతోంది. పది నెలల తర్వాత పోటీల బరిలోకి దిగిన ప్రపంచ చాంపియన్ సింధు మ్యాచ్ ప్రాక్టీస్ లేక తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. సాయిప్రణీత్ కూడా ఆమెలాగే ఓడిపోయాడు. ఆట ఫలితాలు ఇలావుంటే మహమ్మారి ఫలితాలు మరో రకంగా ఆడుకున్నాయి. అగ్రశ్రేణి షట్లర్ సైనా, ప్రణయ్‌లను కోవిడ్ టెస్టులు కలవరపెట్టాయి. తీరా యాంటీబాడీ టెస్టులతో అవి గత అవశేషాలనీ తేలడంతో ఊపిరి పీల్చుకున్నారంతా! మరో భారత టాప్‌స్టార్ కిడాంబి శ్రీకాంత్‌కు చేసిన కరోనా టెస్టులైతే రక్తం చిందించేలా చేశాయి. ఓవరాల్‌గా బ్యాడ్మింటన్ సీజన్ పరేషాన్‌తో ప్రారంభమైంది.
బ్యాంకాక్: ఆటకు ముందు నలుగురు ఆటగాళ్లకు నిర్వహించిన కోవిడ్ పీసీఆర్ పరీక్షల్లో ముగ్గురు బాధితులని రిపోర్టుల్లో వచ్చింది. ఆ ముగ్గురిలో ఇద్దరు మనవాళ్లే కావడంతో భారత జట్టు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సైనా నెహ్వాల్, ప్రణయ్ కరోనా బారినపడ్డారని ప్రకటించారు. దీంతో నిర్వాహకులు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకునే పనిలో భారత కోచ్ సహా అధికార వర్గాలను కోర్టు లోపలికి అనుమతించలేదు. బృంద సభ్యులు పాజిటివ్ కావడంతో అందులోని వారు మ్యాచ్ చూసేందుకు వస్తే మిగతావారికి సోకే ప్రమాదముందని భారత కోచ్, మేనేజర్లను హోటల్ గదులకే పరిమితం చేశారు. తదనంతరం నిర్వాహకులు సైనా, ప్రణయ్‌లతో పాటు మరో బాధితుడు జోన్స్ రాల్ఫి జాన్సన్ (జర్మనీ ప్లేయర్)లకు యాంటిబాడీ ఐజీజీ పరీక్షలు చేయించారు.
ఆశ్చర్యకరంగా భారత ఆటగాళ్లిద్దరికీ పాజిటివ్ ఫలితాలొచ్చాయి. అంటే సైనా, ప్రణయ్‌లకు గతంలో ఎప్పుడో వచ్చివుం టుందని, అవి గతం తాలూకు అవశేషాలని గుర్తించింది. దీంతో వీరిద్దరికి ప్రస్తుతం వైరస్ సమస్య లేదని నిర్దారించుకున్న ఆర్గనైజింగ్ కమిటీ సైనా, ప్రణయ్‌లను ఆడేందుకు అనుమతించింది. వీళ్లతో మిగతావారికి ఎలాంటి ముప్పులేదని ప్రకటించింది. జర్మనీ ప్లేయర్ జాన్సన్‌కు యాంటిబాడీ ఐజీజీ టెస్టుల్లో ఇలాగే పాజిటివ్ రావడంతో అతడినీ ఆడేందుకు అనుమతించిన నిర్వాహకులు... హాతెమ్ ఎల్గమల్ (ఈజిప్ట్)కు నెగెటివ్ రావడంతో అతన్ని తాజా కరోనా బాధితుడిగా టోర్నీ నుంచి తప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment