
కెప్టెన్ రోహిత్ శర్మతో సర్ఫరాజ్ ఖాన్ (PC: sarfarazkhan Instagram)
India vs England, 2nd Test- Sarfraz Khan: ‘‘టెస్టు క్రికెట్ ఆడాలంటే ఎంతో ఓపికగా ఉండాలి. జీవితంలో కొన్నిసార్లు మనం తొందరపాటులో పనులు చేసేస్తూ ఉంటాం. నేను కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టీమిండియాలో అడుగుపెట్టాలని ఎదురుచూసేవాడిని.
ఒక్కోసారి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యేవాడిని. అలాంటపుడు మా నాన్న నన్ను ఓదార్చేవారు. హార్డ్‌వర్క్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడో ఓసారి ఫలితం అదే వస్తుంది. అప్పుడు నిన్నెవరూ ఆపలేరని చెబుతూ ఉంటారు.
ఆత్మవిశ్వాసం, ఓపిక కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని నేను తెలుసుకున్నా. ఇప్పుడు మా నాన్న ఎంతో సంతోషంగా ఉన్నారు. కోట్లాది మంది జనాభా ఉన్న ఈ దేశంలో టీమిండియాలో భాగమయ్యే అవకాశం రావడం పట్ల నాకు గర్వంగా ఉంది’’.. ఇంగ్లండ్‌తో టీమిండియా రెండో టెస్టు ఆరంభానికి ముందు యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్న మాటలివి.
అలా తొలిసారి టీమిండియాకు ఎంపిక
దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతూ.. భారత్-ఏ తరఫున కూడా అదరగొడుతున్న ఈ ముంబై బ్యాటర్‌కు వైజాగ్ టెస్టు సందర్భంగా బీసీసీఐ సెలక్టర్లు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయపడటంతో వారి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్‌లతో పాటు సర్ఫరాజ్‌కు కూడా ప్రధాన జట్టులో చోటిచ్చింది.
అయితే, అంతకంటే ముందే మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్‌లో చోటు కోసం పాటిదార్‌తో పోటీపడ్డ సర్ఫరాజ్‌కు నిరాశే మిగిలింది. తుదిజట్టులో పాటిదార్‌కు స్థానం ఇచ్చారు సెలక్టర్లు.
ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండగా.. బీసీసీఐకి అతడు ఇచ్చిన ఇంటర్వ్యూ తెరమీదకు వచ్చింది. ఓపికగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలు సాధించగలమంటూ 26 ఏళ్ల సర్ఫరాజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సిరాజ్ స్థానంలో అతడు
కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను పరాజయంతో ప్రారంభించింది టీమిండియా. హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ స్టేడియంలో శుక్రవారం రెండో టెస్టు మొదలుపెట్టింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది. రజత్ పాటిదార్ టెస్టు క్యాప్ అందుకోగా.. మహ్మద్ సిరాజ్ స్థానంలో ముకేశ్ కుమార్ జట్టులోకి వచ్చాడు. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు.
చదవండి: SA20 2024: టీ20 మ్యాచ్‌లో విధ్వంసం.. ఏకంగా 462 పరుగులు
Comments
Please login to add a commentAdd a comment