‘‘దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా.. అక్కడి మైదానంలోని వికెట్‌కి అనుగుణంగా మన బ్యాటింగ్ శైలి మార్చుకోవాలి. మా నాన్న ఇదే చెబుతూ ఉంటారు. ఏ పరిస్థితినైనా మనకు అనుకూలంగా మార్చుకోవాలంటారు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో గడపడం నాకెంతో కలిసి వచ్చింది. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే దగ్గర నుంచి భిన్న పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనేది సీనియర్లను చూసి నేర్చుకున్నా.
ఇక ఈ మేము గెలిచిన ఈ ట్రోఫీ జట్టు మొత్తానిది. అయితే, ముషీర్‌కు నేను ఓ మాట ఇచ్చాను. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తానని చెప్పాను. యాక్సిడెంట్‌కు గురై మ్యాచ్‌కు దూరమైన ముషీర్‌కు ఈ అవార్డు అంకితం’’ అని టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. ఇరానీ కప్-2024లో డబుల్ సెంచరీతో మెరిసిన ఈ ముంబై బ్యాటర్.. తనకు దక్కిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తన తమ్ముడు, క్రికెటర్ ముషీర్ ఖాన్‌కు అంకితమిచ్చాడు.
1997లో చివరిసారిగా
కాగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముంబై జట్టు.. దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీ ఇరానీ కప్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన రెడ్‌బాల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజేతగా నిలిచింది. కాగా ముంబై 1997లో చివరిసారిగా ఇరానీ కప్ గెలిచింది. ఇప్పుడిలా.. మళ్లీ 27 ఏళ్ల తర్వాత ట్రోఫీని ముద్దాడింది. ఓవరాల్‌గా ముంబైకిది పదిహేనో ఇరానీ కప్.
కాగా 1997–98 నుంచి గత సీజన్ వరకు మరో ఎనిమిదిసార్లు ఇరానీ కప్ ఆడినా... ముంబై మాత్రం గెలుపు గీత దాటలేకపోయింది. చివరిసారిగా 2015–16లో ఇరానీ కప్‌లో ముంబై పరాజయం పాలైంది. ఈసారి సమష్టి ప్రదర్శనతో కదంతొక్కిన ముంబై ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఓవర్‌నైట్ స్కోరు 153/6తో ఐదోరోజు శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై... 78 ఓవర్లలో 8 వికెట్లకు 329 పరుగులు చేసింది.
తనుశ్ కొటియాన్ వీరవిహారం..
ఈ దశలో ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఇక ఫలితం తేలడం కష్టమని భావించిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు ‘డ్రా’కు అంగీకరించింది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముంబైని విజేతగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో.. సర్ఫరాజ్ ఖాన్ (17) రెండో ఇన్నింగ్స్‌లో త్వరగానే ఔటైనా... తనుశ్ కొటియాన్ (150 బంతుల్లో 114 నాటౌట్; 10 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ సెంచరీతో అదరగొట్టాడు
మిగతా వాళ్లలో... మోహిత్ అవస్థి (91 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) అతడికి చక్కటి సహకారం అందించాడు. సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్ (2) వెంట వెంటనే అవుట్ కావడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లు రెట్టించిన ఉత్సాహంతో బౌలింగ్ చేసినా... తనుశ్ వాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చక్కటి షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
ఫలితం తేలడం కష్టమని
మోహిత్‌తో కలిసి తనుశ్ అబేధ్యమైన తొమ్మిదో వికెట్‌కు 158 పరుగులు జోడించాడు. సాధించాల్సిన లక్ష్యం కొండంత పెరిగిపోగా... అందుకు తగిన సమయం కూడా లేకపోవడంతో చివరకు రెస్ట్ ఆఫ్ ఇండియా సారథి రుతురాజ్ గైక్వాడ్ ‘డ్రా’కు అంగీకరించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై ఎనిమిది వికెట్లు కోల్పోగా... అందులో 6 వికెట్లు ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ తీయడం విశేషం.
అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులు చేయగా... రెస్టాఫ్ ఇండియా 416 పరుగులు చేసింది. దీంతో ముంబైకి 121 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. డబుల్ సెంచరీతో మెరిసిన ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఈ సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం కారణంగా రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు దూరమైన ముషీర్ ఖాన్‌కు తన పురస్కారాన్ని అంకితం చేశాడు. కాగా భారత టెస్టు జట్టులో సభ్యుడైన సర్ఫరాజ్ ఖాన్... బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కకపోవడంతో ఇరానీ కప్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ రెండూ నెగ్గడం సంతోషం
ముంబై జట్టు కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ..‘27 ఏళ్ల తర్వాత తిరిగి ఇరానీ కప్ గెలుచుకోవడం సంతోషంగా ఉంది. తనుశ్ కొటియాన్ చక్కటి ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ విలువైన పరుగులు చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ బాదాడు. రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ రెండూ నెగ్గడం ఆనందంగా ఉంది’ అని హర్షం వ్యక్తం చేశాడు.
ఘన సన్మానం
ఇక సుదీర్ఘ విరామం తర్వాత ఇరానీ కప్‌ను సొంతం చేసుకున్న ముంబై జట్టును ఘనంగా సన్మానించనున్నట్లు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) వెల్లడించింది. వాంఖడే స్టేడియంలో త్వరలోనే ఆటగాళ్లను సన్మానిస్తామని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ తెలిపాడు. దేశవాళీల్లో తమ ఆధిపత్యం చాటుతూ ముంబై జట్టు మరోసారి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందని... సమష్టి ప్రదర్శనకు దక్కిన ఫలితమిదని పేర్కొన్నాడు.
ఇరానీ కప్-2024: సంక్షిప్త స్కోర్లు
ముంబై తొలి ఇన్నింగ్స్: 537
రెస్టా ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: 416
ముంబై రెండో ఇన్నింగ్స్: 329/8.
Comments
Please login to add a commentAdd a comment