NCAలో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌.. కారణం ఇదే! | Sarfaraz Khan To Miss Mumbai Ranji Trophy Opener Ahead of NZ Tests: Report | Sakshi
Sakshi News home page

NCAలో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌.. కారణం ఇదే!

Published Tue, Oct 8 2024 12:34 PM | Last Updated on Tue, Oct 8 2024 1:22 PM

Sarfaraz Khan To Miss Mumbai Ranji Trophy Opener Ahead of NZ Tests: Report

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ రంజీ ట్రోఫీ 2024-25 ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. ఈ ఇరానీ కప్‌ హీరో బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్సీఏ)కి చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన సర్ఫరాజ్‌ ఖాన్‌ తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.

డబుల్‌ సెంచరీ
ఈ క్రమంలో దులిప్‌ ట్రోఫీ తాజా ఎడిషన్‌తో పాటు... ఇరానీ కప్‌-2024లో ముంబై తరఫున బరిలోకి దిగాడు. లక్నోలో అక్టోబరు 1-5 వరకు రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాతో జరిగిన ఈ రెడ్‌బాల్‌ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. తద్వారా ముంబై ఇరానీ కప్‌ టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులతో అజేయంగా నిలిచిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు టీమిండియా సెలక్టర్లకు సవాల్‌ విసిరాడు. ఈ నేపథ్యంలో అతడిని బీసీసీఐ.. ఎన్సీఏకు పంపించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. కివీస్‌తో సిరీస్‌కు అతడిని పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ సందర్భంగా సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. 

స్ట్రాంగ్‌గా రీ ఎంట్రీ
కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా దూరం కావడంతో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ ముంబై బ్యాటర్‌ వరుస అర్ధ శతకాలతో దుమ్ములేపాడు. అయితే, బంగ్లాతో సిరీస్‌ సందర్భంగా రాహుల్‌ తిరిగి రావడంతో అతడికి మళ్లీ మొండిచేయి ఎదురైంది. అయితే,ఈసారి మరింత స్ట్రాంగ్‌గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సర్ఫరాజ్‌ సిద్దమైపోయాడు. 

కాగా ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 ఫైనల్‌కు చేరువైన టీమిండియా.. బంగ్లాతో టీ20 సిరీస్‌ తర్వాత న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడనుంది. అక్టోబరు 16 నుంచి ఈ సిరీస్‌ ఆరంభం కానుంది. అయితే, అక్టోబరు 11 నుంచే రంజీల్లో ముంబై తమ ప్రయాణం  మొదలుపెట్టబోతోంది. బరోడాతో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. దీంతో సర్ఫరాజ్‌ ఖాన్‌ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు పీటీఐ వెల్లడించింది. 

చదవండి: అందుకే స్లోగా బ్యాటింగ్ చేశాం.. మా టార్గెట్‌ అదే: మంధాన

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement