న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ కచ్చితంగా ఆడతాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. కరుణ్ నాయర్ మాదిరి అతడిని దురదృష్టం వెంటాడబోదని జోస్యం చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ముంబైకర్ తుదిజట్టులో ఉండటం అత్యవసరమని పేర్కొన్నాడు.
కాగా కివీస్‌తో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా పరాజయంతో ఆరంభించింది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటై దారుణంగా విఫలమైనప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు భారీ స్కోరు సాధించింది.
ఇందుకు ప్రధాన కారణం సర్ఫరాజ్ ఖాన్. తన కెరీర్‌లో నాలుగో టెస్టు ఆడిన ఈ ముంబై బ్యాటర్ జట్టు కష్టాల్లో ఉన్న వేళ 150 పరుగులతో అద్బుత ప్రదర్శన కనబరిచాడు. అదే సమయంలో మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ కర్ణాటక బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 12 పరుగులకే నిష్క్రమించాడు.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు తుదిజట్టులో చోటు దక్కడానికి కారణం శుబ్‌మన్ గిల్ గైర్హాజరీ. ఫిట్‌నెస్ లేమి కారణంగా గిల్ దూరం కావడంతో విరాట్ కోహ్లి మూడో స్థానంలో రాగా.. సర్ఫరాజ్ నాలుగో నంబర్ బ్యాటర్‌గా కోహ్లి స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే, మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్‌తో సర్ఫరాజ్ పోటీపడుతున్న విషయం తెలిసిందే.
గిల్ తిరిగి వస్తే ఈ ఇద్దరిలో ఒకరిపై వేటుపడకతప్పదు. తాజా ప్రదర్శన నేపథ్యంలో మేనేజ్‌మెంట్ సర్ఫరాజ్‌వైపే మొగ్గుచూపి.. రాహుల్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కరుణ్ నాయర్ సంగతిని గుర్తుచేస్తూ సర్ఫరాజ్‌ను కూడా బ్యాడ్‌లక్ వెంటాడవచ్చునని పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘అవును.. కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ(300) చేసిన తర్వాత కూడా తదుపరి మ్యాచ్‌లోనే అతడిని తప్పించారు. అజింక్య రహానే తిరిగి రావడంతో కరుణ్‌ను డ్రాప్ చేశారు. టెస్టు కెరీర్‌లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే, కరుణ్ నిలకడలేమి ఫామ్ వల్లే అలా జరిగి ఉండవచ్చు.
ఒకవేళ కేఎల్ రాహుల్ కోసం సర్ఫరాజ్‌ను బెంచ్‌కే పరిమితం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే, నాకు మాత్రం అతడు పుణె మ్యాచ్‌లో కచ్చితంగా ఆడతాడనే అనిపిస్తోంది. రాహుల్ రెండు ఇన్నింగ్స్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు.
అంతేకాదు.. ప్రస్తుతం టీమిండియా పరిస్థితి, డ్రెసింగ్ రూం వాతావరణం చూస్తుంటే సర్ఫరాజ్ పుణె టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడనే అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు. స్పోర్ట్స్18తో మాట్లాడుతూ ఆకాశ్ చోప్రా ఈ మేర వ్యాఖ్యలు చేశాడు. కాగా కరుణ్ నాయర్ 2017లో ఇంగ్లండ్‌తో టెస్టులో త్రిశతకం బాదినా.. ఆ మరుసటి మ్యాచ్‌లో అతడికి చోటు దక్కలేదు.
Comments
Please login to add a commentAdd a comment