క్రికెట్‌లో కవర్‌డ్రైవ్, స్ట్రెయిట్ డ్రైవ్, స్క్వేర్‌డ్రైవ్, కట్‌షాట్, స్వీప్ షాట్, రివర్స్ స్వీప్, హుక్ షాట్.. ఇవన్నీ సంప్రదాయంగా వస్తున్నవి. ఇంకా చెప్పాలంటే క్రికెట్‌లో ఎక్కువ మంది బ్యాటర్స్ ఆడే షాట్లు. వీటితో పాటు ఇంకా ఎన్నో కళాత్మక షాట్లు ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో హెలికాప్టర్, స్విచ్‌హిట్ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని హెలికాప్టర్ షాట్ కనిపెడితే.. స్విచ్ హిట్ షాట్‌కు మాత్రం పెట్టింది పేరు ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్.
సంప్రదాయ క్రికెట్‌లో స్విచ్‌హిట్ అనేది కాస్త వినూత్నమైనది.. బౌలర్ బంతి విడుదల చేయగానే బ్యాటర్ తన పొజీషన్‌ను రివర్స్ చేసి ఆడడమే స్విచ్‌హిట్. 2006లో కెవిన్ పీటర్సన్.. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌పై స్విచ్‌హిట్ షాట్‌ను ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు ఎక్కువ సందర్బాల్లో స్విచ్ హిట్ షాట్‌లు ఆడారు. అయితే స్విచ్‌హిట్ షాట్‌పై ఐసీసీకి పలుసార్లు ఫిర్యాదులు వెళ్లాయి. స్విచ్‌హిట్ షాట్ ఆడే సమయంలో పొజీషన్‌ను మార్చి.. ఆ షాట్ ఆడడం మిస్ అయితే ఎల్బీడబ్ల్యూ ఇచ్చే అవకాశం ఎందుకు లేదని కొందరు బౌలర్లు ప్రశ్నించారు.
ఇటీవలే టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్విచ్‌హిట్ షాట్‌పై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ''బ్యాట్స్‌మెన్ స్విచ్‌హిట్ ఆడడంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ స్విచ్‌హిట్ ఆడే సమయంలో బంతి మిస్ అయితే మాత్రం ఎల్బీగా ఇవ్వాల్సిందే. ఎల్బీ ఎందుకు ఇవ్వకూడదనేది నాకు చెప్పాలి. ఒక బ్యాటర్ బంతి వేయగానే పొజిషన్‌ను మార్చినప్పుడే బంతి వికెట్ల మీదకు వెళ్తుంది. కాబట్టి కచ్చితంగా ఎల్బీడబ్ల్యూకి ఆస్కారం ఉంటుంది.'' అని చెప్పుకొచ్చాడు.
కాగా అశ్విన్ చేసిన వ్యాఖ్యలను న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ సమర్థిస్తూనే తప్పులను ఎత్తిచూపాడు. '' అశ్విన్ చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని సమర్థిస్తున్నా.. అదే సమయంలో కొన్నింటిని తప్పుబడతా. స్విచ్ హిట్ అనేది ఫన్నీగా కనిపిస్తున్నప్పటికి బౌలర్‌కు ఎప్పటికి ప్రమాదకరం. అందుకే స్విచ్‌హిట్‌ను పూర్తిగా బ్యాన్ చేస్తే అందరికంటే ఎక్కువగా సంతోషించేది నేనే. బ్యాట్స్‌మన్ తర్వాతి బంతిని స్విచ్ హిట్ ఆడుతాడని ఎవరూ ముందుగా ఊహించరు. క్రికెట్‌లో మిగతా షాట్స్ అంటే ఎలా కొట్టినా ఆన్‌సైడ్, ఆఫ్‌సైడ్‌లో ఎక్కువగా వెళ్తాయి. కాబట్టి ఫీల్డర్లను ముందుగానే సెట్ చేసుకోవచ్చు.
కానీ స్విచ్‌హిట్ విషయంలో ఆ క్లారిటీ లేదు. బౌలింగ్ సైడ్ కెప్టెన్ లేదా బౌలర్ ఫీల్డర్స్‌ను ఎక్కడ ఉంచాలనేది తెలియదు. అందుకే బ్యాటర్స్, బౌలర్స్‌కు ఉపయోగంగా ఉండాలంటే స్విచ్‌హిట్‌ను బ్యాన్ చేయాల్సిందే. స్విచ్‌హిట్ లానే కనిపించే రివర్స్ స్వీప్.. రివర్స్ హిట్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి వీటిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. అయితే స్విచ్‌హిట్ ఆడే క్రమంలో బ్యాటర్ తన పొజీషన్‌ను పూర్తిగా మర్చేయడం.. అదే సమయంలో ఆ షాట్ మిస్ అయితే కచ్చితంగా ప్యాడ్లకు తాకుతుంది. ఇక్కడే అశ్విన్ ఎల్బీడబ్ల్యూ ఇవ్వాలని వాదించాడు. కానీ స్విచ్‌హిట్‌ను పూర్తిగా బ్యాన్‌చేస్తే ఆ ఇబ్బందే ఉండదు కదా'' అంటూ ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment