ఆసీస్‌కు మరో దెబ్బ.. కీలక బౌలర్‌ ఔట్‌! | Sean Abbott Left The Field By Injury In Practice Match Against India | Sakshi
Sakshi News home page

ఆసీస్‌కు మరో దెబ్బ.. కీలక బౌలర్‌ ఔట్‌!

Published Sat, Dec 12 2020 3:08 PM | Last Updated on Sat, Dec 12 2020 5:49 PM

Sean Abbott Left The Field By Injury In Practice Match Against India - Sakshi

సిడ్నీ : బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోపీ ఆరంభానికి ముందే ఆసీస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ దూరం కాగా.. త్యాగి బౌన్సర్‌ దెబ్బకు యువ ఓపెనర్‌ విన్‌ పుకోవిస్కి మొదటి టెస్టుకు దూరమయ్యాడు. తాజాగా ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ సీన్‌ అబాట్‌ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎడమ కాలి చీలమండ గాయంతో అబాట్‌ బాధపడుతున్నట్లు సమాచారం. సిడ్నీ వేదికగా ఇండియాతో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రెండో రోజు ఆటలో భాగంగా మొదటి సెషన్‌లో బౌలింగ్‌కు వచ్చిన అబాట్‌ 7 ఓవర్లు వేశాడు. రెండో సెషన్‌ ప్రారంభమైన కాసేపటికే అబాట్‌కు కండరాలు పట్టేయడంతో బౌలింగ్‌ చేయలేదు. అయితే నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో ఫిజియో సూచన మేరకు పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇప్పుడైతే అబాట్‌ బౌలింగ్‌కు వచ్చే అవకాశాలు లేవని.. ఒకవేళ ఆసీస్‌ బ్యాటింగ్‌ సమయంలో అవసరం అనుకుంటేనే వస్తాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా పేర్కొంది. (చదవండి : క్యాచ్‌ వదిలేశాడని బౌలర్‌ బూతు పురాణం)

ఒకవేళ అబాట్‌ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం ఆసీస్‌కు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. టెస్టు సిరీస్‌లో సీన్‌ అబాట్‌ ఆస్ట్రేలియాకు కీలక బౌలర్‌.. బౌన్సర్లు వేయడంలో దిట్ట అయిన అబాట్‌ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్లను కట్టడి చేస్తాడు. భారత్‌తో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనూ అబాట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు వేసి మూడు వికెట్లు పడగొట్టాడు.ఇప్పటికే గాయంతో డేవిడ్‌ వార్నర్‌, త్యాగి బౌన్సర్‌తో విన్‌ పుకోవిస్కి మొదటి టెస్టుకు దూరమయ్యారు.. తాజగా అబాట్‌ కూడా గాయంతో బాధపడుతుండడం ఆసీస్‌కు ఇబ్బందిగా మారనుంది.

అయితే శుక్రవారం ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భాగంగా టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో బుమ్రా  ఆడిన స్ట్రెయిట్‌ డ్రైవ్‌ బౌలర్‌ కామెరాన్‌ గ్రీన్‌ ముఖంపై బలంగా తగిలిన సంగతి తెలిసిందే. అయితే గ్రీన్‌ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా పేర్కొంది. గ్రీన్‌ గాయం నుంచి కోలుకున్నాడని.. అతను ఆసీస్‌ ఎతో మ్యాచ్‌లో కొనసాగనున్నాడని తెలిపింది. కాగా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భాగంగా రెండో రోజు టీమిండియా లంచ్‌ విరామం తర్వాత 70 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.(చదవండి : నెటిజన్‌ కామెంట్‌కు గబ్బర్‌ ధీటైన కౌంటర్‌)

ఓపెనర్‌ పృథ్వీ షా మరోసారి విఫలం కాగా.. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ 61, శుబ్‌మన్‌ గిల్‌ 61 పరుగులతో ఆకట్టుకోగా.. కెప్టెన్‌ రహానే 38 పరుగులు చేశాడు. ప్రస్తుతం విహారి 63, రిషబ్‌ పంత్‌ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 108 పరుగులకు ఆలౌట్‌ కావడంతో భారత్‌కు ఆధిక్యం లభించింది. బుమ్రా హాఫ్‌ సెంచరీతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 194 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌ కలుపుకొని 334 పరుగుల ఆధిక్యంలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement