India Vs Pakistan ODI Series 2005: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలు చూపించి ఎన్నో అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడీ విధ్వంసక ఆటగాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ, వన్డేల్లో ద్విశతకం సాధించిన బ్యాటర్‌గా సచిన్ టెండుల్కర్‌కు కూడా సాధ్యం కాని ఘనత సాధించాడు. వీరూ భాయ్ క్రీజులో ఉన్నాడంటే బౌలర్ వెన్నులో వణుకు పుట్టాల్సిందే!
సెహ్వాగ్‌ను అవుట్ చేయడమే ఈజీ
అలాంటి సెహ్వాగ్‌ను అవుట్ చేయడమే తనకు అత్యంత సులువుగా ఉండేదంటూ పాకిస్తాన్ మాజీ పేసర్ రానా నవీద్ ఉల్ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను పాక్ జట్టుకు ఆడే రోజుల్లో టీమిండియా మిగతా బ్యాటర్లందరికంటే ఈ ముల్తాన్ కింగ్‌నే ఈజీగా పెవిలియన్‌కు పంపవచ్చని భావించేవాడినని తెలిపాడు. వీరూతో పోలిస్తే రాహుల్ ద్రవిడ్‌ను ఎదుర్కోవడం కష్టంగా ఉండేదని పేర్కొన్నాడు.
2005 నాటి వన్డే సిరీస్ సంగతుల గురించి తాజాగా ప్రస్తావించిన నవీద్ ఉల్ హసన్.. ‘తొలి రెండు మ్యాచ్‌లలో సెహ్వాగ్ అద్భుతంగా ఆడాడు. అప్పటికి మేము ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుకబడి ఉన్నాం. ఒక మ్యాచ్‌లో అయితే సెహ్వాగ్ ఏకంగా సెంచరీ కొట్టాడు. రెండో మ్యాచ్‌లో 70కి పైగా స్కోర్ చేశాడు.
నీకసలు ఆడటమే సరిగ్గా రాదు.. పాక్‌లో ఉండి ఉంటేనా!
అప్పుడు నేను ఇంజీ భాయ్ దగ్గరకు వెళ్లి బంతిని నాకివ్వమని అడిగాను. స్లో బౌన్సర్‌తో సెహ్వాగ్‌ను బోల్తా కొట్టించాను. అంతకంటే ముందు అతడిని నేను స్లెడ్జ్ చేశాను. సెహ్వాగ్ దగ్గరికి వెళ్లి.. ‘‘నీకు అసలు ఎలా ఆడాలో తెలియదు. నువ్వు ఒకవేళ పాకిస్తాన్‌లో గనుక ఉండి ఉంటే.. ఇంత ఈజీగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేవాడివి కాదు’’ అని అన్నాను.
అందుకు బదులుగా తను కూడా నన్ను ఏవో మాటలు అన్నాడు. ఆ వెంటనే నేను ఇంజీ భాయ్ దగ్గరికి వెళ్లి.. ‘‘తదుపరి బంతికి అతడు అవుట్ అవుతాడు చూడు అని చెప్పాను. నిజానికి తను అప్పుడు ఆశ్చర్యపోయాడు. అయితే, నా వ్యూహాన్ని అమలు చేస్తూ.. స్లో బాల్‌ను వేశాను.
వెంటనే అవుటయ్యాడు
అప్పటికే కోపంగా ఉన్న సెహ్వాగ్ భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఇలా అత్యంత ముఖ్యమైన వికెట్‌ను పడగొట్టడం ద్వారా మ్యాచ్ గెలవడంలో నేను కీలక పాత్ర పోషించాను. ఫాస్ట్‌బౌలర్ల దగ్గర ఇలాంటి కొన్ని ట్రిక్స్ ఉంటాయి.
నిజానికి నా దృష్టిలో సెహ్వాగ్‌ను అవుట్ చేయడం సులువే. కానీ రాహుల్ ద్రవిడ్‌కు బౌలింగ్ చేయడం మాత్రం అత్యంత కష్టమైనది’’ అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు నాదిర్ అలీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. నవీద్ ఉల్ హసన్.. సెహ్వాగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు.
సెహ్వాగ్ వికెట్ అతడి ఖాతాలో
కాగా 2005లో పాకిస్తాన్ ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చింది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో టీమిండియా గెలుపొందగా.. ఆఖరి నాలుగు వన్డేలు గెలిచి పాక్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో నవీద్ ఉల్ హసన్ ఏకంగా నాలుగుసార్లు సెహ్వాగ్‌ను అవుట్ చేయడం గమనార్హం. ఇక నవీద్ పాక్ తరఫున 74 వన్డేలు ఆడి 110 వికెట్లు పడగొట్టాడు. తొమ్మిది టెస్టులు, నాలుగు టీ20లు ఆడి వరుసగా 18, 5 వికెట్లు తీశాడు. కాగా సెహ్వాగ్‌పై నవీద్ వ్యాఖ్యల నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వీరూ గురించి మాట్లాడే సీన్ నీకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment