ఇరగదీస్తున్న ఇద్దరు మొనగాళ్లు.. రీఎంట్రీ ఇవ్వాల్సిందే! | Seniors Mohammed Shami-Bhuvaneshwar Kumar Terrific Performance IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: ఇరగదీస్తున్న ఇద్దరు మొనగాళ్లు.. రీఎంట్రీ ఇవ్వాల్సిందే!

Apr 6 2026 9:36 AM | Updated on Apr 6 2026 10:37 AM

Seniors Mohammed Shami-Bhuvaneshwar Kumar Terrific Performance IPL 2026

Photo Courtesy: IPL 2026

మ‌హ్మ‌ద్ ష‌మీ, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌.. ఈ ఇద్దరు టీమిండియాకు ప్రాతినిధ్యం వ‌హించారు. ఎన్నో మ్యాచ్‌ల్లో భార‌త్ గెల‌వ‌డంలో ఈ ఇద్ద‌రు కీల‌క‌పాత్ర పోషించారు. 2013 చాంపియ‌న్స్ ట్రోఫీ భార‌త్ గెల‌వ‌డంలో భువ‌నేశ్వ‌ర్ కీల‌క‌పాత్ర పోషించాడు.  2012లో టీమిండియా త‌ర‌ఫున అరంగేట్రం చేసిన భువ‌నేశ్వ‌ర్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన భార‌త బౌల‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. 

అంతేకాదు ధోని హ‌యాంలో బాగా రాటుదేలిన భువ‌నేశ్వ‌ర్‌కు రానురాను అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. స్వింగ్ డెలివ‌రీల‌తో ముప్ప‌తిప్ప‌లు పెట్టిన భువ‌నేశ్వ‌ర్ ద‌శాబ్ద కాలం పాటు టీమిండియాకు మూడు ఫార్మాట్లు (టెస్టు, వ‌న్డే, టీ20లు) ప్ర‌ధాన బౌల‌ర్‌గా సేవ‌లందించాడు.  2022లో టీమిండియా త‌ర‌ఫున చివ‌రి అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడిన భువ‌నేశ్వ‌ర్ అప్ప‌టినుంచి ఐపీఎల్‌లోనే క‌నిపిస్తున్నాడు.

భువీ క‌థ అలా ఉంటే టీమిండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీది మ‌రో క‌థ‌. నిల‌క‌డ‌కు మారుపేరుగా నిలిచే ష‌మీ జ‌ట్టుకు అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా వికెట్లు తీయ‌డంలో నేర్ప‌రి. ముఖ్యంగా 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ పైన‌ల్ చేర‌డంలో ష‌మీ పాత్ర కీల‌క‌మ‌ని చెప్పొచ్చు. ఆ టోర్నీలో భార‌త్ తుదిమెట్టుపై బోల్తా ప‌డిన‌ప్ప‌టికీ ష‌మీ మాత్రం సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు. 

ఆ టోర్నీలో ఏడు మ్యాచ్‌లాడిన ష‌మీ 24 వికెట్లు ప‌డ‌గొట్టి లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు. టెస్టుల్లోనూ త‌న‌దైన మార్క్ చూపిన ష‌మీకి ఎప్పుడూ అన్యాయం జ‌రుగుతూనే వ‌స్తోంది. గాయాల పేరుతో అకార‌ణంగా జ‌ట్టు నుంచి త‌ప్పించిన ష‌మీ టీమిండియాలో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు కృషి చేస్తూనే ఉన్నాడు.

తాజాగా ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో అటు భువ‌నేశ్వ‌ర్‌.. ఇటు మహ్మ‌ద్ ష‌మీ త‌మ స‌త్తా చాటుతున్నారు. ఈ ఇద్ద‌రు పొదుపుగా బౌలింగ్ చేయ‌డంతో పాటు వికెట్లు నేల‌కూలుస్తూ త‌మ‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిందేనంటూ బీసీసీకి ప‌రోక్షంగా సందేశాలు పంపుతున్నారు. లేటు వ‌య‌సులోనూ ప‌దునైన బౌలింగ్‌తో అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తున్న ష‌మీ, భువ‌నేశ్వ‌ర్ ఐపీఎల్ 19వ సీజ‌న్‌తో మ‌రోసారి సెలెక్ట‌ర్ల దృష్టిలో ప‌డిన‌ట్లే.

గ‌త సీజ‌న్ వ‌ర‌కు గుజ‌రాత్ టైటాన్స్‌లో కొన‌సాగిన ష‌మీని ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ కొనుగోలు చేసింది. ఆదివారం ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ష‌మీ త‌న ప్రాముఖ్య‌త‌ను రుచి చూపించాడు. 4 ఓవ‌ర్లు వేసిన ష‌మీ 9 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 2 కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన షమీ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’  కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో షమీ 122 మ్యాచ్‌లాడి 136 వికెట్లు పడగొట్టాడు.

ఇక ఐపీఎల్‌లో 200 వికెట్ల మార్క్‌ను అందుకున్న భువనేశ్వర్ కుమార్ కూడా తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. 2016లో ఎస్‌ఆర్‌హెచ్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన భువనేశ్వర్ చాలాకాలం పాటు ఆ జట్టుకే ఆడాడు. 

అయితే గత సీజన్‌కు ముందు ఆర్సీబీలోకి వెళ్లిన భువనేశ్వర్ 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అంతేకాదు 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ నెగ్గిన ఆర్సీబీ జట్టులోనూ భువీ బాగమయ్యాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో భువనేశ్వర్ కుమార్ 192 మ్యాచ్‌ల్లో 202 వికెట్లు తీశాడు.

దాదాపు ఒకేసారి అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన షమీ, భువనేశ్వర్‌లు తాజాగా లేటు వయసులోనూ ఇరగదీస్తున్నారు. ఓవరాల్‌గా షమీ అన్ని ఫార్మాట్లు కలిపి 462 వికెట్లు పడగొడితే.. భువనేశ్వర్ అన్ని ఫార్మాట్లు కలిపి 294 వికెట్లు తీశాడు. లేటు వ‌య‌సులో ఇర‌గ‌దీస్తున్న భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, మహ్మ‌ద్ ష‌మీలు మ‌ళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాల‌ని ఆశిద్దాం.

చదవండి: భ‌యంతో ఆడిన పంత్‌.. సంజీవ్ గోయెంకా రియాక్ష‌న్‌!

Advertisement
 
Advertisement
Advertisement