న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లో నల్ల కలువ సెరెనా విలియమ్స్‌కు ఊహించని షాక్ తగిలింది. మ్యాచ్ ఆరంభానికి ముందు ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సెరెనాకు ప్రపంచ మహిళల టెన్నిస్ వరల్డ్ మాజీ నంబర్‌వన్, బెలారస్ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ పోరులో అజరెంకా అదరగొట్టింది. మూడు సెట్ల పోరులో అజరెంకా రెండు గెలుచుకుని ఫైనల్లోకి ప్రవేశించింది. ఫలితంగా సెరెనా కథ సెమీస్‌లోనే ముగిసింది. తల్లి అయ్యాక గ్రాండ్ స్లామ్ గెలుద్దామని భావించిన సెరెనాకు అజరెంకా అడ్డుకట్టవేసింది.
ఈ రోజు జరిగిన సెమీస్‌లో అజరెంకా 1-6, 6-3, 6-3 తేడాతో సెరెనాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. దాంతో ఒక్కసారిగా టైటిల్ ఫేవరెట్ రేసులోకి వచ్చేసింది. తొలిసెట్‌ను అజరెంకా భారీ తేడాతో కోల్పోయినా, మిగతా రెండు సెట్లలో ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. వరుసగా రెండు సెట్లను కైవసం చేసుకుని తుదిపోరుకు సిద్ధమైంది. ప్రధాన టోర్నీల్లో సెరెనా తొలి సెట్‌ను గెలిచిన తర్వాత మ్యాచ్‌లో ఓడిపోవడం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2014 వింబుల్డన్‌లో అలెజ్ కార్నెట్ చేతిలో సెరెనా ఇదే తరహాలో ఓటమి పాలయ్యారు. అప్పుడు తొలి సెట్‌ను గెలిచి మిగతా రెండు సెట్లను సెరెనా కోల్పోయారు.(చదవండి: ‘మ్యాట్’పై విహారి సాధన... )
ఏడేళ్ల విరామం తర్వాత ఫైనల్లో..
యూఎస్ ఓపెన్ సెమీస్‌లో సెరెనా ఓడించడం ద్వారా ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఏడేళ్ల తర్వాత అజరెంకా ఫైనల్‌కు చేరింది. చివరిసారి 2013లో ఓ గ్రాండ్ స్లామ్‌లో ఫైనల్‌కు చేరిన అజరెంకా.. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. కాగా, యూఎస్ ఓపెన్‌లో సెరెనాపై గెలవడం అజరెంకాకు ఇదే తొలిసారి. 2012, 2013లలో యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకొని రెండుసార్లూ సెరెనా చేతిలో ఓడి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న అజరెంకా... ఈసారి ట్రోఫీని ముద్దాడటానికి అడుగుదూరంలో నిలిచింది. అదే సమయంలో వరుసగా 11వ మ్యాచ్‌లో అజరెంకా విజయం సాధించినట్లయ్యింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకూ అజరెంకా, సెరెనా మధ్య 22 సార్లు ముఖాముఖి పోరు జరిగింది. 18 సార్లు సెరెనా... నాలుగుసార్లు అజరెంకా విజయం సాధించారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో వీరిద్దరు 10 సార్లు తలపడగా... పదికి పది మ్యాచ్‌ల్లో సెరెనానే గెలుపొందారు. కాగా, గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో 11వ ప్రయత్నంలో అజరెంకా విజయం సాధించడమే కాకుండా టైటిల్ వేటకు సిద్ధమయ్యారు.
ఒసాకాతో పోరుకు సై
శనివారం జరుగనున్న ఫైనల్లో జపాన్ స్టార్ క్రీడాకారిణి, నాల్గో సీడ్ నయామి ఒసాకాతో అజరెంకా అమీతుమీ తేల్చుకోనున్నారు. మరో సెమీ ఫైనల్లో ఒసాకా 7-6(7/1), 3-6, 6-3 తేడాతో అమెరికా క్రీడాకారిణి జెన్నిఫర్ బ్రాడీపై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. టై బ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను ఒసాకా గెలుచుకోగా, రెండో సెట్‌ను కోల్పోయారు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో ఒసాకా తిరుగులేని తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరారు.(చదవండి: అజేయ విజేత నైట్‌రైడర్స్ )
Comments
Please login to add a commentAdd a comment